● ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి
మొయినాబాద్: పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. చేవెళ్ల జోన్ నెలవారీ నేర సమీక్ష సమావేశం బుధవారం మొయినాబాద్‌లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వంటి అత్యంత సున్నితమైన కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. గ్రేవ్ అన్‌డిటెక్టెడ్ కేసులను సాంకేతిక ఆధారాలు, సీసీటీపీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాల సహాయంతో ఛేదించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, సైబర్ కేటుగాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పెండింగ్ చార్జ్‌షీట్లను నిర్దేశిత గడువులోగా కోర్టులకు దాఖలు చేసి కేసుల పురోగతిని వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్‌గౌతమ్, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సాయిక్ జహంగీర్, చేవెళ్ల ఏసీపీ కిషన్, సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ వెంకటేశం, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ జేమ్స్‌బాబు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ వీరబాబు, జోన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


