మీర్‌పేట: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బావమరిది అర్ఫాజ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనంకు చెందిన మొహమ్మద్ అర్ఫాజ్ చెల్లెలు సభా ఫాతీమా, సోదరుడు సల్మాన్‌ను గతంలో సూరి హత్య చేశాడు. దీంతో అప్పటి నుంచి పగ, ప్రతీకారం పెంచుకున్న అర్ఫాజ్ అవకాశం కోసం ఎదురుచూశాడు. సూరి జైలు నుంచి వచ్చిన తరువాత కూడా అనుమానం రాకుండా అర్ఫాజ్ మంచిగా ఉన్నట్లు నటించాడు. ఈ క్రమంలో సోమవారం సూరి రెండో భార్య సోదరుడి జన్మదిన వేడుకలకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు. వేడుకకు హాజరై కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. తన చెల్లెలు, అన్నను హత్య చేసినందుకు ప్రతీకారంగానే బావ సూరిపై కక్ష పెంచుకుని హతమార్చినట్లు అర్ఫాజ్ విచారణలో అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. వృత్తిరీత్యా పంక్చర్ షాపులో పనిచేసే ప్రధాన నిందితుడు అర్ఫాజ్(22)తో పాటు హత్యకు సహకరించిన నందనవనంకు చెందిన సుహిద్రమణి స్వామి(19), జంగిలొళ్ల నాని(19)లను రిమాండ్ చేశామని వివరించారు.
మొయినాబాద్: విద్యార్థులు తమ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని వాయిస్ 4 సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష భరద్వాజ్ అన్నారు. మండలంలోని తోలుకట్టలో ఉన్న చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాలలో గత 10 రోజులుగా జరిగిన శ్రీహర్ వాయిస్‌శ్రీ శిబిరంలో భాగంగా శ్రీపరిచయ్‌శ్రీ పేరుతో విద్యార్థినులకు యుక్త వయసు, రుతుస్రావం, శరీర మార్పులు, పరిశుభ్రత, భావోద్వేగాలు, భద్రత, హక్కులపై అవగాహన కల్పించారు. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హర్ వాయిస్ కార్యక్రమంలో భాగంగా పరిచయ్, దిశ, సఖి ఫర్ లీడర్‌షిప్ అనే మూడు అంశాలపై కౌమార దశ బాలికలకు అవగాహన కల్పిస్తామన్నారు. కౌమార దశ బాలికల్లో సురక్షితమైన వాతావరాణాన్ని కల్పించి, రుతుస్రావ ఆరోగ్యం, పరిశుభ్రతపై ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ఈ శిబిరం దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్టు...సొత్తు స్వాధీనం
రాంగోపాల్‌పేట్: పనిచేసే సంస్థకు కన్నం వేసి 1.28 కేజీల బంగారు ఆభరణాలను కాజేసిన ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లో బంగారు, వజ్రాభరణాల తయారీ చేసే గురుకృప ఎక్స్‌పోర్ట్ కంపెనీ బ్రాంచ్ కొనసాగుతోంది. మూడేళ్లుగా బీదర్‌కు చెందిన సోన్‌కాంబ్లే హరీష్ (29) సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోని నగల దకాణాల వద్దకు వెళ్లి బంగారు ఆభరణాల నమూనాలు చూపించి ఆర్డర్లు తీసుకుని వస్తుంటాడు. అలాగే ఆర్డర్ చేసిన ఆభరణాలను తిరిగి షాపులకు అందించి చెక్కులు సేకరించి కార్యాలయంలో సమర్పిస్తుంటాడు. బంగారు ఆభరణాలను కార్యాలయంలో ఉండే లాకర్‌లో ఉంచేవాడు. హరీష్‌కు ఇటీవల వివాహం కావడం, వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సంస్థలోని బంగారు ఆభరణాలు దొంగిలించాలని పథకం వేశాడు. ఇదే విషయాన్ని హైటెక్ సిటీలోని పీడబ్లూసీ ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసే తన సోదరుడు ఆకాష్‌కు తెలిపాడు. ఇద్దరూ కలిసి ఈనెల 17వ తేదీన విద్యుత్‌ను, సీసీ టీవీలను నిలిపివేసి బాత్‌రూమ్ గ్రిల్ తొలగించి ఆభరణాలు దొంగిలించారు.ఆ ఆభరణాలన్నీ హరీష్.. ఆకాష్‌కు అందించాడు. నేరం చేసిన తర్వాత కూడా హరీష్ ఎలాంటి భయం లేకుండా కార్యాలయానికి వచ్చాడు. అయితే పోలీసులకు మొదట ఎలాంటి అనుమానం రాకున్నా సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకోగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను మంగళ్‌హాట్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 1.28 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.


