షాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, కార్పొరేట్ వైద్యం అందేలా ఉచిత హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని, కుటుంబాలకు భరోసా కల్పించే గ్రూప్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా) సౌకర్యాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, జిల్లా సంయుక్త కార్యదర్శులు సత్యనారాయణ, సూర్యనారాయణ, రమేష్, ఈసీ సభ్యుడు ఇలియాజ్ షరీఫ్, చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, సభ్యులు రాంచంద్రయ్య, రమేశ్‌యాదవ్, గోవర్ధన్‌రెడ్డి, కరుణాకర్‌చారి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
టీయూడబ్ల్యూజే షాబాద్ మండల నూతన అధ్యక్షుడిగా రవీందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్, గౌరవ అధ్యక్షుడిగా రాంచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా నర్సింలు, శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా నరేందర్, లక్ష్మణ్, శివరాజ్‌గౌడ్, కోశాధికారి పూర్ణచందర్ గుప్తా, ఈసీ మెంబర్లుగా అనిల్, రాజేష్, మధు, రాజేందర్, రవి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి


