నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Jul 22 2026 9:00 AM | Updated on Jul 22 2026 9:00 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

అబ్దుల్లాపూర్‌మెట్‌: నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్దఅంబర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని నల్గొండ వే బ్రిడ్జి దగ్గర రెండు కార్లలో నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ముఠాను పట్టుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ముచ్చుపాల్‌ సుధాకర్‌ రావు, చెన్నం హనుమంతరావు, దేవరశెట్టి పరుశ రాములు, ముప్పూరు పరమేశ్వరరావు, పూరేటి అప్పారావు, మోజాల ఆంజనేయులు ముఠాగా ఏర్పడ్డారు. తెలంగాణలోని పత్తి రైతులకు ఈ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ కిలోకు సుమారు రూ.2,500 చొప్పున విక్రయించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 400 కిలోలు (13 గోనె సంచుల్లో) నకిలీ పత్తి విత్తనాలు, రెండు కార్లు, ఆరు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏ–1 సుధాకర్‌రావుపై చండూరు పీఎస్‌లో, చెన్నం హనుమంతరావుపై చండూరు, అఫ్జల్‌గంజ్‌ ఠాణా పరిధిలో ఇప్పటికే నకిలీ విత్తనాల కేసులున్నాయని పోలీసులు చెప్పారు. నకిలీ విత్తనాల మూలం, అక్రమ సరఫరా గొలుసులో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

రైతులకు పోలీసుల హెచ్చరిక

అనుమతి లేని, నకిలీ పత్తి విత్తనాలను ఉపయోగించడంతో మొలక శాతం తగ్గడంతో పాటు పంట పూర్తిగా పాడవుతుందని ఎల్‌బీనగర్‌ డీసీపీ అనురాధ సూచించారు. మల్కాజిగిరి పోలీసులు నకిలీ విత్తనాల తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి, వాటి సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల విక్రయం లేదా రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తెలిసినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు.

ఆంధ్రా నుంచి పత్తి విత్తనాలు తీసుకువచ్చి తెలంగాణలో విక్రయించేందుకు యత్నం

పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రూ. 10లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement