స్వదేశానికి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

స్వదేశానికి తీసుకెళ్లండి

Jul 20 2026 7:41 AM | Updated on Jul 20 2026 7:41 AM

స్వదేశానికి తీసుకెళ్లండి

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ పహాడీషరీఫ్‌ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్‌ వెళ్లిన మహిళ షబ్నంబేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్‌ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా ఒమన్‌లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్‌ ద్వారా ఒమన్‌ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్‌ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్‌ నా పాస్‌పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్‌ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement