పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

పీడీఎస్‌ బియ్యం పట్టివేత వైద్యం వికటించి మహిళ మృతి

ఆమనగల్లు: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు కలిసి మండలంలోని మేడిగడ్డతండాలో పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారని స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల సమాచారంతో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ రామకృష్ణ, ఆమనగల్లు ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఇందులో 107.90 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డతండాకు చెందిన నేనావతన్‌ మణిపాల్‌ ప్రజల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ గోదాములో అప్పగించి ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.

హయత్‌నగర్‌: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం శుక్రవారం రాత్రి హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్‌ చేశారు. సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్‌ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement