బంజారాహిల్స్: ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన కిలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఈడెన్ గార్డెన్‌లో ఉన్న గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్‌లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బరువు ఉన్న 14 బంగారు ఆభరణాలు (7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు) కనిపించలేదు. కార్యాలయంలో వాష్‌రూమ్ కిటికీ ధ్వంసమైనట్లు గుర్తించడంతో దుండగులు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సూరత్‌కు చెందిన వ్యాపారి ప్రీతేష్‌రమణి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ‘సర్’ పాట్లు అందరికీ తెలిసిందే. బీఎల్‌వోలు సరిగా ఫారాలు పంపిణీ చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నవారు ఎందరో. ఈ నేపథ్యంలో ఒక్క ఓటు కోసం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఏఈఆర్‌వో) ఒకరు 10 కిలోమీటర్లు వెళ్లి.. ఓటరు నివాసం వద్ద ఎన్యూమరేషన్ ఫారం అందించారు. చింతల్ సర్కిల్ పరిధిలో ఒక ఓటరు నివాసం బీఎల్‌వో పోలింగ్ స్టేషన్ పరిధికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఆ ఒక్క ఓటూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఏఈఆర్‌వోగా ఉన్న అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (చింతల్ సర్కిల్–54) కె.ప్రవీణ్ కుమార్ తానే వెళ్లి ఇలా ఫారం అందజేశారు.


