దండం పెడతాం.. డంప్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

దండం పెడతాం.. డంప్‌ వద్దు

Jul 19 2026 6:53 AM | Updated on Jul 19 2026 6:53 AM

కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వానికి దండం పెడతాం.. కానీ మండలంలోని సిద్ధాపూర్‌లో డంప్‌యార్డును రద్దు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. డంప్‌యార్డును రద్దు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్ముల్‌నర్వలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు శేఖర్‌రెడ్డి, సురేందర్‌, దేవేందర్‌, నవీన్‌చారితో పాటు పలువురిని ముందస్తుగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా గ్రామాలు, తండాల్లో పలువురిని హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. తాము ప్రభుత్వ విధానాలను, అభివృద్ధిని అడ్డుకోవడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా తమ ఉనికి, స్థానికత, ఆస్తులు, ఆరోగ్యం కోసం ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే వచ్చే కాలుష్యం కారణంగా 50 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని వివరించారు. వెంటనే జీవో నంబర్‌ 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

కేసులు పెట్టాలని లేదు: డీసీపీ

డంప్‌యార్డు రద్దు కోసం రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్న ప్రజలపై లాఠీచార్జి, కేసులు నమోదు చేయాలని పోలీసులకు లేదని డీసీపీ శిరీష స్పష్టం చేశారు. చట్ట పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే తాము గౌరవిస్తామని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోక తప్పదన్నారు. ఇన్ముల్‌నర్వలో ప్రజలు చేపట్టిన ధర్నా ప్రాంతంలోనే ఆమె కలెక్టర్‌తో మాట్లాడగా పది మందిని కార్యాలయానికి రావడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం జేఏసీ, స్థానికులతో ఈ నెల 21న మంగళవారం రోజున కలెక్టర్‌ నారాయణరెడ్డి తన కార్యాలయంలో చర్చించనున్నట్లు ప్రజలకు తెలిపారు. దీంతో కలెక్టరేట్‌ ముట్టడి తాత్కాలికంగా విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, ప్రభాకర్‌, శేఖర్‌రెడ్డి, సురేందర్‌, సిరాజ్‌, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement