ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని మహిళా మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో శనివారం లభ్యమైంది. స్థానిక ఎస్‌ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో సమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు గల మహిళా మృతదేహం ఉప్పరిగూడ(చేపలు పట్టే ప్రాంతం) వైపు కొట్టుకొచ్చింది. మృతదేహం ఉబ్బిపోయి ఉందని, ఆమె ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌ఓ 8712662361కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
యాచారం: తన భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఓ మహిళా రైతు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డికి మొరపెట్టుకుంది. వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన దిప్తీ అనే వైద్యురాలు మండల పరిధిలోని నస్దిక్‌సింగారం గ్రామంలో సర్వేనంబరు 245లో ఎకరా 12 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. పట్టా అమలు కోసం మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంది. కానీ కలెక్టర్ కార్యాలయం వద్ద రిజక్ట్ అయింది. దీంతో శనివారం యాచారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీఓను కలిసి తన భూ సమస్యను తెలియజేసింది. వెంటనే స్పందించిన ఆర్డీఓ పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శంకర్‌పల్లి: రోడ్డు పక్కన మేత మేస్తున్న ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందగా.. రైతుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని పర్వేద గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు అనంతయ్య తెలిపిన ప్రకారం.. ఉదయం కాడెడ్లను తాళ్లతో పట్టుకుని మేపుతూ పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తగిలిన ఓ ఎద్దు వెంటనే కిందపడిపోయింది. తాడు వదిలేయడంతో ప్రాణాపాయం తప్పిందన్నాడు. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరాడు.


