లైసెన్స్ లేకుండా ఇంపోర్టెడ్ పండ్ల విక్రయాలు
ఆ దుకాణాలు తొలగిస్తాం
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రానికే ఫ్రూట్ హబ్‌గా నిలిచిన బాటసింగారం మార్కెట్‌లో లైసెన్స్డ్ వ్యాపారుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. దిగుమతి పండ్ల పేరుతో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్ లైసెన్స్ లేకుండానే దుకాణాలు పెట్టి విక్రయిస్తున్నారు. అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీ ‘నింజకార్ట్’ ఉద్యోగులు సైతం ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడం అక్రమాలకు అద్దంపడుతోంది.
యథేచ్ఛగా వ్యాపారం
మార్కెటింగ్ చట్టాల ప్రకారం మార్కెట్‌లో పండ్లు విక్రయించాలంటే మార్కెట్ కమిటీ నుంచి లెసెన్స్ తీసుకుని ఉండాలి. రోజువారీ క్రయవిక్రయాలపై తక్‌పట్టీలు జమచేసి అందుకనుగుణంగా ఫీజు చెల్లించాలి. కానీ బాటసింగారం మార్కెట్‌లో స్థానికేతరులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అమెరికా ఆపిల్, ఆస్ట్రేలియా ఆరెంజ్, ఈజిప్ట్ ద్రాక్ష వంటి విదేశీ ఫలాలను నేరుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక కమీషన్ ఏజెంట్లు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.
నష్టపోతున్న కమీషన్ ఏజెంట్లు
లక్షలు వెచ్చించి లైసెన్స్ తీసుకుని, ప్రభుత్వానికి ఫీజులు కడుతూ వ్యాపారం చేస్తున్న స్థానిక కమీషన్ ఏజెంట్లు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లైసెన్స్ లేని వారు తక్కువ రేటుకు అమ్మి మార్కెట్ ఆదాయానికి గండికొడ్డుతున్నారు. అక్రమార్కులు అధికారులకు ముడుపులు చెల్లిస్తూ తమ వ్యాపారాన్ని కుదేలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలకు డిమాండ్
అక్రమ వ్యాపారస్తుల కారణంగా ప్రభుత్వానికి ప్రతీ రోజు రూ.లక్షల్లో నష్టం చేకూరుతోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకుని విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లెసెన్స్డ్ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది, కొందరు అధికారుల ప్రమేయం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
మార్కెట్ ఫీజు చెల్లించకుండా వ్యాపారం
బాటసింగారం మార్కెట్‌లో నష్టపోతున్న లైసెన్స్డ్ వ్యాపారులు
లైసెన్స్ లేకుండా స్థానికేతరులు మార్కెట్‌లో పండ్ల విక్రయాలు చేపట్టడం చట్ట విరుద్ధం. సమస్య మాదృష్టికి రాలేదు. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ విక్రయించే వారి దుకాణాలు వెంటనే తొలగిస్తాం. వ్యాపారానికి లైసెన్స్ తప్పనిసరి. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవు.
– ఎల్.శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, బాటసింగారం


