మట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలి

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుజాత

ఇబ్రహీంపట్నం రూరల్‌: రైతులు మట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత సూచించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాల అస్థిరత, మధ్యలో ఏర్పడుతున్న పొడి దశలు, తేమ లోపాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు నేల తేమను కాపాడుకోవడం, మట్టి కోతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పొలాన్ని అవసరానికి మించి దున్నకుండా తక్కువ దున్నకం లేదా సున్నా దున్నకం పద్ధతులను అనుసరించాలన్నారు. పంట అవశేషాలు, గడ్డి, ఆకులు వంటి వాటితో మల్చింగ్‌ చేసి నేలలో తేమ నిల్వ ఉండేలా చూడలన్నారు. పొలాల్లో ఫీల్డ్‌ బండ్లు, కాంటూర్‌ బండింగ్‌, కాంటూర్‌ ట్రెంచెస్‌ ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ చేయాలన్నారు. చిన్న చెక్‌డ్యామ్స్‌ గుంతలు, ఫామ్‌ పాండ్స్‌ ద్వారా వర్షపు నీటిని సేకరించి అవసరమైనప్పుడు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. వాలు భూముల్లో కాంటూర్‌ సాగు పాటించి మట్టి కొట్టుకుపోకుండా చూడాలన్నారు. పొలం అంచుల్లో గడ్డి, చెట్లు లేదా పొదలతో జీవ బండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భూపార పరిరక్షణ, సేంద్రియ ఎరువులు, కంపోస్ట్‌, పచ్చిరొట్ట ఎరువులు వినియోగించి నేల సారవంతాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పారు. మట్టి పరీక్ష ఆధారంగా మాత్రమే ఎరువులు వాడి భూసార సమతుల్యతను కాపాడాలన్నారు. పంట మార్పిడి పాటించి నేలలో పోషక లోపం రాకుండా జాగ్రత్త పడాలన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి అవసరమున్న తక్కువ వ్యవధి కలిగిన పంటలు రకాలను ఎంచుకోవాలి. ఇందుకు రైతులు సమీప వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి భూమి స్వభావం, నీటి లభ్యత, పంట పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక సలహాలు పొందాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement