వచ్చింది రాసేసి.. తోచింది ఇచ్చేసి! | - | Sakshi
Sakshi News home page

వచ్చింది రాసేసి.. తోచింది ఇచ్చేసి!

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

అడ్డగోలుగా పరీక్షలు రూ.వేలల్లో ఫీజుల వసూలు జనం ప్రాణాలతో చెలగాటం బయటపడ్డ ఓ క్లినిక్‌ నిర్వాకం

మొయినాబాద్‌: సాధారణంగా ఆర్‌ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటంది. నిబంధనల ప్రకారం ఎలాంటి సూదిమందులు, సైలెన్లు పెట్టడానికి వీల్లేదు. వచ్చిన రోగులకు ప్రథమ చికిత్స అందించి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు రెఫర్‌ చేయాలి. కానీ మొయినాబాద్‌లోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు ఏకంగా ఆస్పత్రినే నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. దీనిపై ఇటీవల స్థానికులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసి సదరు క్లినిక్‌ను సీజ్‌ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బెడ్లు వేసి.. సిబ్బందిని నియమించుకుని

మున్సిపల్‌ కేంద్రంలో శ్యామ్‌ క్లినిక్‌ పేరుతో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు క్లినిక్‌ నడుపుతున్నాడు. ఆయన భా ర్య కూడా అందులో డాక్టరే. మరో నలుగురు సిబ్బందిని పెట్టుకుని క్లినిక్‌ పేరుతో ఆస్పత్రినే నడు పుతున్నారు. సుమారు పది బెడ్లు వేసి వచ్చినవారికి సూది మందులతోపాటు సైలెన్లు ఎక్కిస్తున్నారు. క్లినిక్‌కు అనుబంధంగా మెడికల్‌ షాపు సైతం నడు పుతున్నారు.నిత్యం వందల మంది రోగులువస్తుండడంతో వైద్య పరీక్షలు, సూదిమందులు, సైలె న్లు అంటూ వారి నుంచి రూ.వేలల్లో గుంజుతున్నారు.

వికటిస్తున్న వైద్యం

పదేళ్లకు పైగా నడుస్తున్న ఈ క్లినిక్‌లో చాలా మందికి వైద్యం వికటించింది. ఇటీవల కనకమామిడికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం రాగా చాలా రకాల పరీక్షలు చేశారు. సూది మందులు, సైలెన్లు ఎక్కించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ 20 రోజుల పాటు చికిత్స పొందుతూ చివరికి మరణించింది. ఆరు నెలల క్రితం కాళ్లనొప్పులతో వచ్చిన వ్యక్తికి క్లినిక్‌లో ఇంజక్షన్‌ ఇవ్వడంతో వికటించి ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది. ఇతర ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నా తగ్గకపోవడంతో కాలును తొలగించారు.

స్థానికుల ఫిర్యాదుతో..

అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌పై ఇటీవల స్థానికులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు క్లినిక్‌ను తనిఖీ చేసి సూదిమందులు, సైలెన్లు, బెడ్లు ఉండటాన్ని గుర్తించారు. క్లినిక్‌ బోర్డుపై ఎంబీబీఎస్‌ డాక్టర్ల పేర్లు రాసి ఉండటంతో తీవ్రంగా పరిగణించిన ఈ నెల 7న క్లినిక్‌ను సీజ్‌ చేశారు. అదేరోజు రాత్రి ఆర్‌ఎంపీ వైద్యుడు ఫుల్లుగా మద్యం తాగి బస్తీవాసులు, స్థానికులను బండబూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. దీనిపైనా స్థానికులు మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నయీమొద్దీన్‌ తెలిపారు.

చాలా క్లినిక్‌లలో ఇదే తీరు

మొయినాబాద్‌ పరిసర ప్రాంతాల్లో క్లినిక్‌ల పేరుతో ఆర్‌ఎంపీ డాక్టర్లు జోరుగా ఆస్పత్రులు నడుపుతున్నారు. ఇష్టానుసారంగా సూది మందులు, సైలెన్లు ఎక్కిస్తూ అమాయక ప్రజల నుంచి వేల రూపాయల ఫీజులు గుంజుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఆర్‌ఎంపీల అరకొర వైద్యం

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

మొయినాబాద్‌లో ఆర్‌ఎంపీ వైద్యుడు నడుపుతున్న క్లినిక్‌పై ఫిర్యాదులు వచ్చా యి. వైద్యాధికారులను పంపించి తనిఖీ చేయించాం. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించి సీజ్‌ చేశాం. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేయిస్తాం. ఆర్‌ఎంపీ వైద్యులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– స్వర్ణకుమారి, జిల్లా వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement