షాద్‌నగర్: నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ఆగస్టు 7, 8 తేదీల్లో పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురువారం న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయానికి పాలమూరు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, అనుబంధ కళాశాలల సంఘం అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి వెళ్లి కలిశారు. సదస్సుకు హాజరు కావాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
యాచారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సర్కార్ దృష్టి సారించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా గురువా రం మొండిగౌరెల్లి, నల్లవెల్లి, మాల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు, పెండింగ్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని, పదోన్నతులు, బదిలీలను వెంటనే చేపట్టాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి, నాయకులు చారి, నరేందర్‌రెడ్డి, లక్‌పతి, బాలకృష్ణ, లింగం తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్ తనిఖీ
కేశంపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న 108 అంబులెన్స్‌ను జిల్లా క్వాలిటీ ఆడిటర్ కిశోర్, ఎమర్జెన్సీ ఎగ్జి క్యూటివ్ రాజబాబు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో నిల్వ ఉన్న మందుల గడువు తేదీ, సామగ్రిని పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఈఎంటీ సురేష్, పైలెట్ దీపక్ పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందులకు
గురి చేయొద్దు
కందుకూరు: తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంవారిని మరింత ఇబ్బందులకు గురిచేసేలా నిర్ణ యాలు తీసుకుంటోందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూరియా సహా ఎరువుల ఉచిత రవాణా సౌకర్యాన్ని నిలిపివేయడం ద్వారా రైతులపై సుమారు రూ.250 కోట్ల అదనపు భారం మోపుతోందన్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, విద్యుత్ సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. పండించిన పంటకు బోనస్ ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం, కనీసం వ్యవసాయానికి అవసరమైన ఎరువులను కూడా అందించకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా నాయకుడు జిట్టా రాజేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఉన్నారు.


