ఇబ్రహీంపట్నం రూరల్: ప్రపంచీకరణ, పాశ్చాత్య సంస్కృతి పోకడలు కుల వృత్తులు కుదేలు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగానికి సగం మంది వృత్తులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి వృత్తిదారులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగం చేస్తున్నారు. కుల వృత్తులను కుదేలు చేసి, వృత్తిదారులను రోడ్డున పాడేస్తున్నారు. ముఖ్యంగా దేవతల నాటి నుంచి ఉన్నటువంటి సురాపానకం తీసే గీత వృత్తిపై రియల్ కాటు పడుతోంది. రాత్రికి రాత్రే మహా వృక్షాలను నరికివేసి గీత కార్మికుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు. తాటి చెట్ల నరికివేతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్ పాత ఇబ్రహీంపట్నం మండలంలోనే ఉంది. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న మండలం కూడా ఇదే. ఈ ప్రాంతంలో గీత సామాజిక వర్గం ప్రజలు ఊరికి 30 శాతం వరకు ఉంటారు. వీరంతా తాత ముత్తాతల నుంచి వస్తున్న కుల వృత్తులను నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇటీవల భూముల ధరలకు రెక్కలు రావడంతో వాటిలో తాటి చెట్లను తొలగించడంతో సగం మంది వృత్తులకు దూరమయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాటి చెట్లను నరకడమే లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో స్థానిక సొసైటీ తీర్మానం మేరకు గీతకు పనికి రాని చెట్లను తొలగించడానికి అనుమతులు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
రాత్రికి రాత్రే వందలాది వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు. స్థానిక ఎకై ్సజ్ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని గీత కార్మికులు వాపోతున్నారు. ఈ ప్రాంతం మొత్తం రియల్ ఎస్టేట్ భూం ఉండటంతో ఇలా చెట్లను కూల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందేంటని ప్రశ్నిస్తే కలెక్టర్ ఆర్డర్ ఉంది, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతులు ఉన్నాయని దబాయిస్తున్నారు. గ్రామాల్లో కల్లుగీత కార్మిక సొసైటీలకు చెట్లపై సర్వ హక్కులు ఉంటాయి. తాటి చెట్లు కూల్చడానికి, లైసెన్స్‌లు ఇప్పించడానికి, పన్నులు చెల్లించడం తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేది వారే. కానీ గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరుక్కుంటూ పోతే వృత్తి ఏమైపోవాలని కార్మికులు బోరున విలపిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లిలో ఇటీవల ఓ వ్యక్తి రాత్రికి రాత్రే ఏకంగా 23 తాటి చెట్లను కూల్చి వేశాడు. అందులో పండుతాడు నుంచి రోజుకు 8 లీటర్ల కల్లు పారే చెట్లు పది వరకు ఉండడంతో గీత కార్మికులు కంట తడి పెట్టారు. ఆదిభట్ల మున్సిపాలిటీ సర్కిల్ కొంగరకలాన్‌లో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 57 తాటిచెట్లు నరకడానికి అనమతులు పొందింది. ఆ చెట్లను కూల్చడానికి ప్రయత్నిస్తుండగా గురువారం స్థానిక గీత కార్మికులు అడ్డు కోవడంతోఎనిమిది వరకు చెట్లు కూల్చి ఆపివేశారు.
భూముల ధరలు పెరగడంతో..
రాత్రికి రాత్రే నేలమట్టం
గీత వృత్తిపై రియల్ పడగ
ఇష్టానుసారంగా వృక్షాల నరికివేత
సొసైటీలకు తెలియకుండానే జరుగుతున్న తతంగం
కల్లు పారే చెట్లను సైతం వదలని వైనం
లబోదిబోమంటున్న కార్మికులు