కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ దివ్యాంగుడైన యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరేష్(27) జేపీదర్గా సమీపంలోని నిత్యం భిక్షాటన చేస్తూ కాలినడకన ఇన్ముల్‌నర్వలోని ఇంటికి చేరుకుంటాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడ్ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు బాధితుడి అన్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవపడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు.ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉదయం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మృతుని జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా న్యాయ సేవా సంస్థ చొరవతో రక్షించిన అధికారులు
సిటీ కోర్టులు: దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ అందించిన సమాచారంతో అధికారులు కోట శ్రీనివాస్ అనే కార్మికుడిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ నిర్మాణ స్థలం నుండి రక్షించారు. వివరాలు.. కుటుంబ అవసరాల కోసం రూ.1.60 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న శ్రీనివాస్‌ను కృష్ణ, రాము అనే కాంట్రాక్టర్లు గత నాలుగేళ్లుగా బంధీగా ఉంచి, రోజుకు కేవలం రూ.100 ఇస్తూ ఉదయం నుండి రాత్రి వరకు బలవంతంగా పని చేయించేవారు. తిరస్కరిస్తే దాడులకు పాల్పడేవారు. అతని భార్యతో కూడా వేరే చోట పని చేయించి, ఆమె జీతాన్ని ఈ అప్పు వడ్డీ కింద జమ కట్టేవారు. ఇటీవల శ్రీనివాస్‌ను స్వగ్రామానికి పంపి, అతని భార్యను నెలరోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ కర్ణ కుమార్, కార్యదర్శి అనూష ఆదేశాల మేరకు రెవెన్యూ, లేబర్, కార్మిక శాఖల అధికారులు దాడి చేసి భార్యాభర్తలిద్దరినీ సురక్షితంగా రక్షించారు.
సనత్‌నగర్: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని బేగంపేట, ప్రకాశ్‌నగర్‌లలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి నిర్మాణ, కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలు అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్, అర్బన్ బయోడైవర్సిటీ విభాగాల అధికారులు, రామ్‌కీ, ఈపీటీఆర్‌ఐ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రహదారి పక్కన అక్రమంగా పారబోసిన నిర్మాణ వ్యర్థాలను గుర్తించిన కమిషనర్ సంబంధిత ఆస్తి యజమానిని, బిల్డర్‌ను ప్రశ్నించారు. అధీకృత సంస్థకు బదులుగా అనధికార వాహనాలను వినియోగించినట్లు తేలడంతో వెంటనే అధికారులు, మౌలాలి–అమ్ముగూడ ప్రాంతంలో అనధికారికంగా డంప్ చేస్తున్నట్లు గుర్తించారు.


