షాబాద్: షాబాద్‌లో బొడ్రాయి ప్రతిష్ఠాపన 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామస్తులు బొడ్రాయి వద్దకు బారులు తీరి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండాల అశోక్, మాజీ సర్పంచులు తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రవీందర్, వెంకట్‌యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జడల లక్ష్మీరాజేందర్‌గౌడ్, ఉపసర్పంచ్ దండు రాహుల్‌గుప్తా, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.


