షాద్‌నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీలోని 2, 9, 18, 21, 26, 27వ వార్డుల్లో సోమవారం వార్డుసభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. ఉదయం 9 గంటలకు సభలు ప్రారంభమవుతాయని, ఆయా వార్డుల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రీప్రైమరీ తరగతులు మంజూరైనట్లు ఎంఈఓ మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని వెలిజర్లతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్‌కాలనీ, క్రిస్టియన్‌కాలనీ, ఆర్టీసీకాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇన్‌స్ట్రక్టర్ ఇంటర్, ఆయాల కోసం 7వ తరగతి అర్హత కలిగి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ సాయంత్రం వరకు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మరిన్నీ వివరాలకు 96035 54546 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
చిన్నారి కుటుంబానికి అండగా ఉంటా
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో గత నాలుగు నెలల క్రితం మల్లన్న జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనిక ఆదివారం షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారి జాతరలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. చిన్నారి మృతిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయం చేశారన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయకముందే కొందరు నాయకులు రాద్దాంతం చేశారే తప్పా ఎవరూ ఆదుకోలేదన్నారు. తాను అండగా ఉంటానని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీనిచ్చారు.
డిప్యూటీ ఖాజీగా మహమ్మద్ రఫీఖ్
కేశంపేట: మండల డిప్యూటీ ఖాజీగా చౌలపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ ఎంపికయ్యారు. ఈ మేరకు షాద్‌నగర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తేఖార్ అలీ చేతుల మీదుగా ఆదివారం ఆయన నియామకపత్రం అందుకొన్నారు. మైనార్టీ వక్ఫ్‌బోర్డు పరిధిలో పనిచేస్తూ ముస్లింలకు సంబంధించిన వివాహాలు, విడాకుల వ్యవహారాలతో పాటు ధార్మిక వ్యవహారాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ అలీ సూచించారు.
ఎస్‌ఎఫ్‌సీ సభ్యుడికి సన్మానం
కడ్తాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియామకమైన మండల కేంద్రానికి చెందిన ఎండీ ఆసీఫ్ అలీని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్పతినాయక్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యాదయ్య, రాజునాయక్, జహంగీర్‌అలీ, రమేశ్ తదితరులు ఉన్నారు.
మంచాల: సీపీఎం జిల్లా నాయకుడు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి మాతృమూర్తి(ప్రమీళ) ఇటీవల మృతి చెందడంతో వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. ఆదివారం రంగాపూర్‌లో ఆమె చిత్రపటం వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, డీజీ.నర్సింగ్‌రావు, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, అలాగే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, మర్రి నిరంజన్‌రెడ్డి, రాంరెడ్డి నివాళుల ఆర్పించి శ్రీనివాస్‌రెడ్డిని ఓదార్చారు.


