కొత్తూరు: ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం.. భూతాపం పెరగడంతో పాటు పలు విపత్తులకు కారణమయ్యే నాణ్యత లేని పాలిథిన్(ప్లాస్టిక్) ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక వ్యాపారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి తీర్మానం చేసి ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ అధికారుల నిఘా కొరవడడంతో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
యథేచ్ఛగా వాడకం..
మండల కేంద్రంతో మొదలుకొని అన్ని పంచాయతీలు, అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల్లో సైతం నాణ్యత లేని పాలిథిన్ కవర్లు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, అల్పాహారం, కిరాణ, కూరగాయలు, పండ్లు, ఇతర చిరు దుకాణాల్లో వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లను తయారు చేయడం.. ఉపయోగించడాన్ని గతంలో ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ మండలంలో పాలిథిన్ సంచుల నాణ్యతను గుర్తించే యంత్రాలు లేకపోవడం.. సంబంధిత శాఖ అధికారుల అలసత్వం కారణంగా మండలంలో వ్యాపారులు యథేచ్ఛగా కవర్లు వాడుతున్నారు. మండలంలో రోజుకు సగటున 60 నుంచి 80 కిలోల వరకు పాలిథిన్ సంచుల విక్రయం సాగుతోంది. గ్రామాల్లోని పలు కాలనీల్లో వాడి పడేస్తున్న పాలిథిన్ సంచులను కొందరు ఇళ్ల సమీపంలోనే కాల్చుతున్నారు. దీంతో సమీపంలోని ఇళ్లలోకి విషపూరితమైన పొగ వ్యాపిస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
అనర్థాలు ఇలా..
పాలిథిన్ సంచులు ఏళ్ల తరబడి భూమిలో కరిగిపోకుండా ఉండడంతో విపరీతమైన భూతాపం పెరుగుతోంది. వర్షాకాలంలో కాల్వల్లో వరద ప్రవాహాన్ని అడ్డుకొని సమస్యలను సృష్టిస్తాయి. నాణ్యత లేని పాలిథిన్ గ్లాసులు, ఇతర ఉత్పత్తుల్లో టీ, వేడి ఆహార పదార్థాలను తినడంతో పలు రకాల వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని జనావాసాల మధ్య కుప్పగా పడేసి కాల్చడంతో విషపూరితమైన వాసన కారణంగా శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
విచ్చలవిడిగా పాలిథిన్ విక్రయాలు
అవగాహన కల్పిస్తున్నా మారని తీరు
తూతుమంత్రంగా అధికారుల తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే వివిధ రకాల వ్యాపారులతో సమావేశం నిర్వహించాం. నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లు, ఇతర ఉత్పత్తులను విక్రయించడం.. వినియోగించకుండా అవగాహన కల్పించాం. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు సైతం విధించాం. తరచూ చేసే తనిఖీల్లో ప్లాస్టిక్‌ను వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – బాలాజీ, మున్సిపల్ కమిషనర్, కొత్తూరు


