షాద్‌నగర్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన విద్యార్థిని బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అఖిలను ఆదివారం బీజేపీ నాయకులు అందె బాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్యాట అశోక్, నాయకులు వంశీకృష్ణ, రఘునాథ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గం ఎన్నిక
యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం 12వ మండల మహాసభ జరిగింది. ఈ సభకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్, అంజయ్యలు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం చేసిన రాజీలేని పోరాటాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇదే మాదిరి ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. అనంతరం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ పుష్ప, కావలి జగన్‌లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా లాజర్, జంగయ్య, సహాయ కార్యదర్శిగా కుమార్, కార్యవర్గ సభ్యులుగా రాములు, జంగయ్య, సత్యనారాయణ, సురేష్, సత్యం, జగన్, ఇంద్రమ్మ, అంజయ్య, శివ, రాములను ఎంపిక చేశారు. ఈ నెల 14న షాద్‌నగర్‌లో జరిగే జిల్లా మహా సభలకు యాచారం మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని నిర్ణయించారు.
స్వయం ఉపాధి మేలు
కడ్తాల్: యువత స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయలను స్థానిక నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి తదితరులున్నారు.
ఆమనగల్లు: స్థానిక ఎస్‌ఐగా కోటేశ్వర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని మోకిల పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఆమనగల్లుకు వచ్చారు. ఆదివారం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి, ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు.


