ఆర్థిక సాయం
మన్సూరాబాద్: గాలి దుమారానికి లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధి విరన్నగుట్ట బస్తీకి చెందిన రమేష్ ఇంటిపై పక్కనే నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇంటి రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్‌ఎస్ యువనేత జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆదివారం ఇంటిని సందర్శించి బాధిత కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. నాయకులు చంద్రారెడ్డి, కేకేఎల్ గౌడ్, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు పాస్టర్స్, క్రైస్తవ సంఘాల సమావేశం
మలక్‌పేట: మలక్‌పేట నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధర్యంలో ఈ నెల 9న పాస్టర్స్, క్రైస్తవ సంఘాల నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రోళ్ల మాణిక్యం అబ్రాహాం తెలిపారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముఖ్య అతిథిగా హజరవుతారని వెల్లడించారు. రాక్ చర్చి సీనియర్ పాస్టర్ బిషప్ తిమోతి కొల్లబత్తుల, బాప్టిస్టు చర్చి సినీయర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బోడ సాల్మన్ వాఖ్యోపదేశం చేస్తారని తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ బాప్టిస్టు చర్చిలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి అందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత
చంపాపేట: కాలనీల పరిశుభ్రతలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎంసీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ చిత్రం సురేష్ కోరారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో చంపాపేట డివిజన్ సూర్యానగర్ కాలనీలో గడప గడపకూ వెళ్లి తడి పొడి చెత్తను విఽధిగా వేరు చేసి స్వచ్ఛ ఆటోవాలాలకు అందజేయాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొందరు చెత్తను ఆటోవాలాలకు అందజేయకుండా అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా రహదారులపై డంపింగ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కాలనీవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు కృష్ణారెడ్డి, గౌతమ్‌రెడ్డి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నారా?
లింగోజిగూడ: ఎల్‌బీనగర్ జోనల్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో కాలనీల్లో కుక్కలు, కోతులతో ప్రజలు ఇబ్బంది పడితే వెటర్నరీ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు. నాగోలు, హయత్‌నగర్ సర్కిల్ అధికారి డాక్టర్ పి.శ్యాంసుందర్ (ఫోన్: 90634 21353), సరూర్‌నగర్, ఎల్‌బీనగర్ సర్కిల్ అధికారి డాక్టర్ భుక్యానాయక్ (ఫోన్: 90638 36131)లను సంప్రదించాలని తెలిపారు.


