షాబాద్: కంపెనీల వద్ద జాగ్రత్తలు పాటించకుంటే వాటికే నష్టమని చేవెళ్ల ఏసీపీ కిషన్ పేర్కొన్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్‌లో శనివారం హైతాబాద్, మాచన్‌పల్లి, సీతారాంపూర్, చందనవెళ్లి తదితర గ్రామాల శివారుల్లో ఉన్న కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీలు పెరిగి పోవడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉద్యోగాల రీత్యా ఇక్కడే నివసిస్తున్నారని తెలిపారు. కంపెనీల్లో ఉద్యోగం ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు తీసుకోవాలన్నారు. ఇళ్లు అద్దెకిచ్చే వారు సైతం పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతే అద్దెకివ్వాలన్నారు. ప్రతి కంపెనీ వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ రెట్టింపు చేసుకోవాలని, ప్రతి సెక్యూరిటీ వద్ద పోలీసుల ఫోన్ నంబర్లు ఉంచాలని చెప్పారు. అనుమానం వస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు.


