‘జంట’.. కాలుష్యపు కుంట!
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండి పేట) జంట జలాశయాలను నిజాం కాలంలో నిర్మించారు. నగర విస్తరణతోపాటు కొన్నేళ్లుగా ఎగువ ప్రాంతాలైన మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, గండిపేట మండలాల్లో కొత్త కాలనీలు, ఫాంహౌస్‌లు, విల్లాలు, ఇళ్లు, పరిశ్రమలు, హోటళ్లు , విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఆయా ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు జలాశయాల్లోకి చేరుతోంది. హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చిన్నమంగళారం, మోత్కుపల్లి, జన్వాడ, ఖానాపూర్ గ్రామాల మురుగునీరు నేరుగా గండిపేట జలాశయంలో కలుస్తోంది. అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, కొత్వాల్‌గూడ, కవ్వగూడ, శంషాబాద్‌కు చెందిన మురుగునీరంతా హిమాయత్‌సాగర్‌లోకి చేరుతోంది. జలాశయాలను ఆనుకుని నిర్మించిన ఫాంహౌస్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, కన్వెన్షన్లలోని మురుగునీరు, వ్యర్థాలు సైతం జలాశయాల్లోనే కలుస్తున్నాయి. తద్వారా జలాశయాల్లోని నీళ్లు కలుషితమవుతున్నాయి. ప్రతి రోజు గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్‌సాగర్‌లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్లు జలమండలి అధికారుల పరిశీలనలోనే తేలడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఎస్టీపీల నిర్మాణం ఎప్పటికో..
జంట జలాశయాల్లో శుద్ధ జలమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు ఎస్టీపీల నిర్మాణానికి ఏడాది క్రితం శ్రీకారం చుట్టింది. రూ.82.23 కోట్ల నిధులతో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో నాలుగు సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పనులు మొదలు పెట్టింది. గండిపేట జలాశయం పరిధిలో మొయినాబాద్ మున్సిపాలిటీలోని హిమాయత్‌నగర్ వద్ద 5 ఎంఎల్‌డీ, శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ వద్ద 4 ఎంఎల్‌డీ, హిమాయత్‌సాగర్ జలాశయం పరిధిలో మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ వద్ద 5 ఎంఎల్‌డీ, శంషాబాద్ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ వద్ద 6 ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మార్చి నాటికి పూర్తిచేయాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకున్నా సాధ్యమయ్యేలా లేదు. ఎస్టీపీల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు సగం మాత్రమే జరిగాయి. నిర్మాణం పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు మురుగు ముప్పు
జలాశయాల్లోకి నేరుగా చేరుతున్న మురుగునీరు
చెంతనే ఇష్టారీతిన వ్యర్థాల పారబోత
కలుషితమవుతున్న జలం
నత్తనడకన ఎస్టీపీల నిర్మాణం
తాజాగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
మురుగు నీరు కలుస్తోంది
గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీళ్లు రోజురోజుకూ కలుషితమవుతున్నాయి. కొన్ని గ్రామాల మురుగునీరు నేరుగా వెళ్లి కలుస్తోంది. చెత్తా చెదారం, వ్యర్థపదార్థాలు వాటి పక్కనే వేస్తున్నారు. రక్షణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
– వెంకట్‌రెడ్డి, మొయినాబాద్
ఎస్టీపీలు పూర్తిచేయాలి
జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ఎస్టీపీల నిర్మాణం ఏడాది క్రితం మొదలు పెట్టారు. ఇప్పటికి సగం పనులే అయ్యాయి. అధికారులు వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. ప్రతి గ్రామం వద్ద ఓ ఎస్టీపీ నిర్మిస్తే మురుగునీరు చేరకుండా ఉంటుంది.
– రాజు, చిలుకూరు
జీవోలున్నా అమలు శూన్యం
జంట జలాశయాల నీటి పరిరక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోలు తీసుకొచ్చింది. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవో తేగా 2023లో తెలంగాణ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసి 69 జీవోను తెచ్చింది. వీటి ప్రకారం జలాశయాల ఎగువ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. జీవోలు అమల్లో ఉన్నా ఎక్కడా నిర్మాణాలు ఆగలేదు. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరగడంతో ఇప్పుడు వాటి నుంచి వెలువడే మురుగు, వ్యర్థ పదార్థాలు నేరుగా జలాశయాల్లో చేరుతున్నాయి. జీవోల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత మురుగు ముప్పునకు దారితీసింది.


