వివరణ ఇచ్చినా.. వినరే! | - | Sakshi
Sakshi News home page

వివరణ ఇచ్చినా.. వినరే!

Feb 25 2026 11:35 AM | Updated on Feb 25 2026 11:35 AM

వివరణ ఇచ్చినా.. వినరే!

వివరణ ఇచ్చినా.. వినరే!

కందుకూరు: గ్రామాల్లో మహిళాభివృద్ధి కోసం ఏర్పడిన సొసైటీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. పెద్ద పెద్ద బడా కంపెనీలను వదిలిపెట్టి రూపాయి, రూపాయి పొదుపు చేయడం, అప్పు తీసుకుని మళ్లీ చెల్లించే తమ సొసైటీపై పన్ను విధించడంతో కందుకూరులోని స్నేహ మహిళా సొసైటీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రూ.1.34 కోట్ల పన్ను విధింపు

మండల కేంద్రంలో 2001లో మహిళాభివృద్ధి కోసం స్నేహ మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సొసైటీ లిమిటెడ్‌ను(స్నేహ మహిళా సొసైటీ) ఏర్పాటు చేశారు. ప్రారంభంలో పది మందికి ఒక గ్రూపు చొప్పున 430 సంఘాలు ఏర్పడ్డాయి. డీఆర్‌డీఏ నుంచి రూ.12.50 లక్షలు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించింది. సభ్యులుగా చేరిన ఒక్కొక్కరు రూ.5 వేల చొప్పున డిపాజిట్‌ చేశారు. ఆ నిధులతో ప్రారంభించి బ్యాంకుల నుంచి అదనంగా రూ.కోటి వరకు రుణం తీసుకుని సంఘాలకు తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి, తిరిగి తీసుకోవడం చేశారు. ఒక్కో సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పులు ఇచ్చారు. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తిరిగి చెల్లించే వారు. ప్రస్తుతం ఆ సంఘాలు 480కు చేరాయి. 2008 తర్వాత వెలుగు పథకం అమలు చేయడంతో వీరిపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేదు. అందులో చేరిన మహిళా సంఘాలే అన్నీ చూసుకుంటున్నాయి.

2022లో తొలిసారి

2016 ఏడాది నోట్ల రద్దు సమయంలో సంఘాల వద్ద ఉన్న పెద్ద నోట్లను సొసైటీలో జమ చేసి తమ అప్పులు తీర్చుకున్నారు. దీంతో ఆదాయపు పన్ను శాఖ సొసైటీలో జరిగిన లావాదేవీలను పరిశీలించకుండానే రూ.1.34 కోట్ల మేర పన్ను చెల్లించాలని పేర్కొంటూ 2022లో నోటీసులు పంపింది. దీనిపై సంఘం ప్రతినిధులు వివరణ సైతం ఇచ్చారు. అప్పటి అధికారులు బదిలీ అవడంతో కొత్తగా వచ్చినవారు మళ్లీ ఇటీవల నోటీసులు జారీ చేశారు. తాము కేవలం మహిళా సంఘాలకు అప్పులు, ఇవ్వడం తిరిగి సేకరించడం, వ్యక్తిగత డిపాజిట్లు సేకరించడం తప్పా మరో లావాదేవీలు అనధికారికంగా చేయలేదని, అయినా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సొసైటీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

స్నేహ మహిళా సొసైటీకి

మరోసారి ఆదాయపు పన్ను నోటీసు

అనధికార లావాదేవీలు

చేయలేదని వెల్లడి

గతంలోనే పూర్తి నివేదిక సమర్పణ

సమస్యను పరిష్కరించాలని

సభ్యుల విజ్ఞప్తి

అప్పీలు చేశాం

2022లో ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసుకు జవాబు ఇచ్చాం. మేము చేసేది బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని, సంఘాలకు ఇవ్వడం తప్పా మరొక లావాదేవీ ఏదీ లేదు. అన్ని రికార్డులు పారదర్శకంగానే ఉన్నాయి. అయినా పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడం బాధాకరం.

– మణెమ్మ, అధ్యక్షురాలు,

స్నేహ మహిళా సొసైటీ, కందుకూరు

డీఆర్‌డీఏ కిందికి రావాలి

స్వయం కృషితో మహిళలందరం సంఘాలుగా ఏర్పడి సొసైటీని నడిపించుకుంటున్నాం. ఆదాయ పన్ను చెల్లించాలని నోటీసులు రావడం ఇబ్బందిగా ఉంది. తమ సొసైటీని గతంలో మాదిగి డీఆర్‌డీఏ అజమాయిషీ కిందకి ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే మాకు భరోసా లభిస్తుంది.

– స్వరూప, సలహాదారు,

స్నేహ మహిళా సొసైటీ, కందుకూరు

Advertisement
 
Advertisement
Advertisement