ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
పీఎంశ్రీ పాఠశాలల సదస్సుల్లో విద్యావేత్తల పిలుపు
అబ్దుల్లాపూర్‌మెట్: ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో తెలంగాణ రీజియన్‌లోని పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు మెంటరింగ్ సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని పిగ్లీపూర్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికై ంది. రాష్ట్రంలోని మొత్తం 3 కళాశాలలో మాత్రమే ఈ సదస్సులు నిర్వహిస్తుండగా బుధవారం సదస్సును ప్రారంభించారు. పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి సి.గంగిరెడ్డి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్‌వీ వేణుగోపాలరావు, ఏఐసీటీఈ నోడల్ హెడ్ అసీమ్‌కల్టా, వాడ్వాని ఫౌండేషన్ వక్త డాక్టర్ రాజేశం, శ్వేతలు పాల్గొని ఏఐసీటీఈ నుంచి పరిశోధన నిధుల కోసం వినూత్న ఆలోచనలు అంశంపై వివరించారు.
పార్సిళ్లపై నిఘా ఉంచండి
● అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి
● సర్వీస్ ప్రొవైడర్లతో సీపీ సజ్జనర్
సాక్షి, సిటీబ్యూరో: కేవలం లాభార్జనే ధ్యేయంగా కాకుండా సర్వీస్ ప్రొవైడర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ హితవు పలికారు. ఈ–కామర్స్, కొరియర్ సేవల మాటున గంజాయి, మత్తు పదార్థాలు, నిషిద్ధ వస్తువుల రవాణా జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయా సంస్థలు పటిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆయన బుధవారం అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్ల నోడల్ అధికారులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేయాలని టెలికాం, ఇంటర్‌నెట్, ఫుడ్ డెలివరీ, కొరియర్, రవాణా తదితర సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులను కోరారు. కేసుల దర్యాప్తులో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, సమాచారం అడిగిన వెంటనే స్పందించేందుకు వీలుగా ప్రతి సంస్థలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత పార్శిల్స్‌ను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్లలో కొంత మంది క్యాబ్, బైక్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు తమ డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రయాణికులు బుక్ చేసుకున్నప్పుడు వెళ్లాల్సిన ప్రదేశం చెప్పిన తర్వాత, డబ్బు చెల్లించిన తర్వాత డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి డ్రైవర్లపై సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో అదనపు సీపీలు ఎం.శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్బాల్, సంయుక్త సీపీ శ్వేత, డీసీపీలు ఎస్.చైతన్య కుమార్, వి.అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.


