ట్రాక్టర్ బోల్తా బాలిక మృతి
● మరో మహిళకు తీవ్ర గాయాలు
● కేసు నమోదు చేసిన
నవాబుపేట పోలీసులు
నవాబుపేట: ట్రాక్టర్ బోల్తాపడి ఓ బాలిక మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ముబారక్‌పూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌కు చెందిన మాదాస్ కిష్టయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం. భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం నవాబుపేట మండలం ముబారక్‌పూర్‌కు చెందిన అంతమ్మోళ్ల దయాకర్‌రెడ్డి (బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు) వద్ద పనిచేస్తూ, స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. చైతన్యనగర్‌కే చెందిన గోపి, అతని భార్య మౌనిక సైతం ఇక్కడే పనిచేస్తున్నారు. ఉదయాన్నే గోపీ తన భార్యతో పాటు కిష్టయ్య పెద్ద కూతురు అనూష(14)ను తీసుకుని ట్రాక్టర్‌లో పొలానికి బయల్దేరాడు. ఈక్రమంలో గుబ్బడిపత్తేపూర్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో అనూష (14) అక్కడికక్కడే చనిపోగా మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యజమాని దయాకర్‌రెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మౌనికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, అనూష మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే తన కూతురు కూలీ పనులకు వెళ్లదని, ఇంటి వద్దే ఉండేదని, తమకు చెప్పకుండా ట్రాక్టర్‌పై వెళ్లిందని అనూష తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, గోపీ ట్రాక్టర్ నడపలేదని, అంతమ్మోళ్ల వెంకట్‌రెడ్డి నడిపాడని పోలీసులకు చూపింనట్లు సమాచారం. ఈ విషయమై నవాబుపేట ఎస్‌ఐ పుండ్లిక్‌ను వివరణ కోరగా మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


