‘మున్సిపల్’ సందడి
● ధ్రువీకరణ పత్రాలు,
బిల్లుల చెల్లింపులకు
పరుగులు పెడుతున్న పోటీదారులు
● నామినేషన్లకు ఎక్కువ గడువు లేకపోవడంతో హడావుడి
ఇబ్రహీంపట్నం: ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పట్టణంలోని 24 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, హెల్ప్ డెస్క్ కౌంటర్ల ఏర్పాటు కోసం అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మున్సిపల్ పన్నులు, విద్యుత్, నీటి బిల్లుల బకాయిల చెల్లింపులకు, కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాల కోసం పోటీదారులు పడరానిపాట్లు పడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు చేరుకుని బిల్లులు చెల్లించారు. నామినేషన్ల స్వీకరణకు తక్కువ గడువు ఉండటంతో త్వరగా పని పూర్తి చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు.
ఎటూ తెల్చుకోలేని కాంగ్రెస్
అభ్యర్థుల ఎంపిక అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆయా వార్డులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. గెలుపు గుర్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గురువారం పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ముందంజలో బీఆర్‌ఎస్..
అభ్యర్థుల ఎంపికలో బీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. రెండుమూడు వార్డుల్లో మినహా కేండెట్ల ఎంపికను పూర్తి చేసింది. బుధవారం ఉదయం 12 మంది పోటీదారుల పేర్లను ప్రకటించింది.
పోలీసు పహారా
మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న దారులను పోలీసులు మూసేశారు. దీంతో ఆయా రూట్లలో వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. కార్యాలయం వద్ద సిబ్బంది పహారా కాస్తున్నారు.


