చికిత్స పొందుతున్న మహిళ మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన నండూరి ఎల్లమ్మ(66), ఆమె భర్త తిరుపతయ్యతో పాటు పలువురు ఈ నెల 25వ తేదీన ఆటోలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం శివారులోని మైసమ్మ తల్లి దేవాలయానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కొత్తగూడెం నుంచి పోచంపల్లి మార్గంలో సాయిబాబా ఆలయ ముఖద్వారం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎల్లమ్మ తీవ్రంగా గాయపడగా తిరుపతయ్యతో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ఎల్లమ్మ బుధవారం మృతిచెందింది. కేసు దర్యాప్తులో ఉంది.
బైక్ ప్రమాదంలో వ్యక్తి..
యాచారం: బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రావణ్‌కుమార్(38) తన బైక్‌పై మాల్–కుర్మిద్ద మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లిపల్లి గ్రామం వద్ద మంగళవారం గోడకు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
సినీ దర్శకుడు శంకర్‌కు మాతృవియోగం
మణికొండ: ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ మాతృమూర్తి సక్కుబాయమ్మ(81) బుధవారం మృతి చెందారు.మణికొండ చిత్రపురి కాలనీలోని ఆయన నివాసంలో ఆమె ఉదయం మరణించారు. సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, యూనియన్ నాయకులు, కార్మికులు నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను గురువారం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మట్టి టిప్పర్ సీజ్
పూడూరు: అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌త్‌రెడ్డి తెలిపారు. బుధవారం మన్నేగూడ సర్కిల్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓవర్ లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


