గుర్తు తెలియని మృతదేహం లభ్యం
యాలాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన యాలాల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ప్రతిభ పాఠశాల వెనుక కంది పంటలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. సుమారు పది రోజలు క్రితం మృతి చెంది ఉండవచ్చునని, మృతుడు వయస్సు సుమారు 45–50 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహానికి సంబంధించిన ఓ కాలును జంతువులు పీక్కు తిని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి ఒంటిపై నలుపు రంగు నైట్ ప్యాంట్, గడ్డం ఉందన్నారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే వెంటనే సెల్ నంబరు 8712670054లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
పాఠశాలను సందర్శించిన డీపీఓ
కొడంగల్ రూరల్: మండలంలోని చిట్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణలోని పాత భవనాన్ని పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేపట్టాలా..? తొలగించాలా..? అనే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తరగతి గదుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత గుర్తించి విద్యార్థులను అడిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ చంద్రకళ, వార్డు సభ్యులు హబీబుల్లా, సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


