6,573 మంది ఖైదీలకు న్యాయ సహాయం
తెలంగాణ జైళ్ల శాఖ
డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా
చంచల్‌గూడ: వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 6,573 మంది ఖైదీలు న్యాయ సహాయం పొందారని తెలంగాణ రాష్ట్ర జైళ్ల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. సోమవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ శిక్షణ సంస్థ (సీకా) మైదానంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురు వేసిన అనంతరం డీజీ మాట్లాడుతూ... జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమంతో పాటు ఖైదీల సంక్షేమానికీ విశేషంగా కృషి చేస్తున్నదన్నారు. గత సంవత్సరం రాష్ట్ర జిల్లా న్యాయ సహకార సంస్థ ద్వారా ఎంతో మంది ఖైదీలు న్యాయ సహాయం పొందారన్నారు. 44 జైల్ అదాలత్‌లు నిర్వహించి 1,558 కేసులను విచారించగా 985 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా మొత్తం 616 ఖైదీలకు రూ. 1.92 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. అర్హులైన ఖైదీలకు పెరోల్ మంజూరు చేశారన్నారు. థంబ్ ఇన్–సైన్ ఔట్‌లో భాగంగా 23,220 ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఐజీలు యెర్రంశెట్టి రాజేష్, ఎన్.మురళీబాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌లు నవాబు శివకుమార్‌గౌడ్, వెంకటలక్ష్మీ, శ్రీమాన్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


