జాతీయ జెండాకు అవమానం
చేవెళ్ల: మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఇక్కడ ఓ స్థానిక నాయకుడు జెండాను ఆవిష్కరించగా, అపసవ్య దిశలో ఎగుతున్న జెండాను గమనించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ మాధవిరాంరెడ్డి జాతీయ జెండాను కిందికి దించి, సరిచేసిన అనంతరం మళ్లీ ఎగురవేశారు. ఈ విషయంపై సర్పంచ్, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేయగా, పొరపాటు జరిగిందని జెండా కట్టిన వారు చెప్పారు. అయితే, పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను సర్పంచ్ లేదా పంచాయతీ సెక్రటరీ ఎగరేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ సీనియర్ నాయకుడితో జెండావిష్కరణ చేయించారు. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓను అడగగా, విషయం మా దృష్టికి రాలేదని, తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జెండావిష్కరణలో అపశ్రుతి
మంచాల: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో మండలంలోని ఆంబోత్ తండాలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తుండగా తాడుతో పాటు పతాకం కింద పడింది. మువ్వెన్నెల జెండా ఎగుర వేసే సమయంలో అపశ్రుతి జరగడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు.
జెండా ఎత్తని పాఠశాలలు
పహాడీషరీఫ్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని విద్యా సంస్థల్లో సోమవారం సంబురాలు నిర్వహించగా, జీహెచ్‌ఎంసీ జల్‌పల్లి సర్కిల్‌లోని సెయింట్ ఫ్లవర్, సెయింట్ మర్యామ్ పాఠశాలలు వేడుకలకు దూరంగా ఉన్నాయి. కనీసం ఆయా స్కూళ్ల గేట్లు కూడా తెరవలేదు. ఇది గమనించిన గ్రామ యువజన సంఘాల నాయకులు గౌర మురళీకృష్ణ, శ్రీకాంత్‌గౌడ్, యంజాల శివకుమార్, యాదగిరి, దూడల శివకుమార్ తదితరులు స్కూళ్ల వద్దకు వెళ్లి నివ్వెరపోయారు. వెంటనే ఫోన్‌లో సదరు యాజమాన్యాలను సంప్రదించగా, తమకు ఆరోగ్యం బాగోలేదని, పరీక్షలు ఉన్నాయని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆగ్రహానికి గురైన యువకులు ఆయా స్కూళ్ల ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయాన్ని పహాడీషరీఫ్ పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
జాతీయ జెండాకు అవమానం


