పారదర్శకతకు పెద్దపీట
లబ్ధిదారులకు పక్కాగా సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరూ అంకితభావంతో పని చేయాలి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ నారాయణ రెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం.. జిల్లా అభివృద్ధే ధ్యే యంగా శ్రమిస్తున్నాం.. జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలి’ అని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే ..
త్వరలో మూసీ సుందరీకరణ పనులు
ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు ద్వారా ప్రజలు, పెట్టుబడిదారులకు భద్రత మరింత మెరుగు పడుతుంది. ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డును కలుపుతూ ఇటు రావిర్యాల నుంచి అటు ఆమనగల్లు వరకు 41.5 కిలోమీటర్లు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో 300 అడుగుల వెడల్పుతో చేపట్టిన రేడియల్ రోడ్డు పనులు హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్‌సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. బుద్వేల్ నుంచి షాబాద్, కొందుర్గు, చౌదరిగూడ మీదుగా నాచారం వరకు మరో రేడియల్ రోడ్డు ఏర్పాటుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశాం. మూసీనది ప్రక్షాళనలో భాగంగా మొదటి దశలో హిమా యత్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న ఈసీ నది, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న మూసీ నది సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టబోతున్నాం.
సంక్షేమ పథకాలతో లబ్ధి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 15,543 ఇళ్లను మంజూరు చేసి, ఇప్పటి వరకు 10,327 నిర్మాణాలను మొదలు పెట్టి, రూ.253.97 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏడాది కాలంలో 35,543 మంది లబ్ధిదారులకు వివిధ రకాల చికిత్సలు అందించి, రూ.121.39 కోట్లు చెల్లించాం. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 126.24 కోట్ల జీరో టికెట్లు జారీ చేశాం. గృహజ్యోతి పథకంలో భాగంగా 3.31 లక్షల మందికి జీరో బిల్లులు జారీ చేసి, రూ.12.30 కోట్ల సబ్సిడీని డిస్కంకు చెల్లించాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద 2,82,850 మంది రైతుల ఖాతాల్లో రూ.323 కోట్లు జమ చేశాం. 2025–26లో 289 మంది రైతులు మృతి చెందగా, రైతు బీమా పథకం కింద రూ.14.45 కోట్లు.. వానాకాలంలో 2,879 మంది రైతుల నుంచి 14,866 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.35.52 కోట్లు చెల్లించాం.
మొగిలిగిద్దలో ఏటీసీ సెంటర్
జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా, మూడింటిని యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పోగ్రాం కింద ఎంపిక చేసి, కందుకూరులో సీఎల్‌ఏటీ, ఇబ్రహీంపట్నంలో నీట్, శంషాబాద్‌లో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో కేజీబీవీకి రూ.3.66 లక్షలు మంజూరు చేశాం. 764 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.23.37 కోట్లు, 1,251 పాఠశాలల నిర్వహణ కోసం రూ.4.66 కోట్లు మంజూరు చేశాం. ఆరు యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్లకు పాలనా అనుమతులు పొంది, ఇప్పటికే షాద్‌నగర్, కల్వకుర్తి స్కూళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాం. వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే విద్యార్థుల్లో మరింత నైపుణ్యం కోసం కందుకూరు మండలం పంజాగూడ, ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లకు పాలనా అనుమతులు తెచ్చుకున్నాం.
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించారు. ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశాంసా పత్రాలు అందజేశారు. ‘చెక్ దే ఇండియా’ దేశభక్తి గీతానికి నాదర్‌గుల్ డీపీఎస్ స్కూలు విద్యార్థులు, గళ్లు..గళ్లు జోడెడ్ల బండి జానపద గీతానికి ఎంజేపీ పాలమూకుల పాఠశాల విద్యార్థులు, జై జవాన్..జై కిసాన్ గీతానికి మహేశ్వరం భాష్యం స్కూలు విద్యార్థులు, ఆమనగల్లు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యం, ఆపరేషన్ సింధూర్‌పై జెడ్పీహెచ్‌ఎస్ సాహెబ్‌నగర్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం, తుక్కుగూడ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన బంజారా నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, శంషాబాద్ డీసీపీ రాజేశ్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కూర్చొనేందుకు సరిపడా కుర్చీలు లేకపోగా, అధికారులు, సిబ్బంది సహా వివిధ వేషధారణలో వచ్చిన విద్యార్థులు గంటల తరబడి ఎండలోనే మగ్గాల్సి వచ్చింది.
వైద్య సేవల్లో నంబర్ వన్
ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కీలకంగా పని చేస్తున్నాయి. వైద్య సేవల్లో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలవడం అభినందనీయం. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద 20 ఆస్పత్రుల్లో ప్రతి మంగళవారం 18 ఏళ్లు నిండిన మహిళలకు 8 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. చేయూత పథకం కింద 1,91,716 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.47.75 కోట్లు అందజేస్తున్నాం. బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 9,243 స్వయం సహాయక సంఘాలకు రూ.785.94 కోట్లు, సీ్త్ర నిధి సంస్థ ద్వారా రూ.19.02 కోట్ల రుణాలు మంజూరు చేశాం. 383 పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.4.97 కోట్ల రుణాలు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు, వసతి గృహాల్లో చదువుతున్న వారికి మెస్ చార్జీలు చెల్లిస్తూ పేద విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తున్నాం.


