
గుర్తుంచుకోండి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేష్ సందడి జోరందుకుంది. ఇప్పటికే అనేక మండపాలకు వినాయక విగ్రహాలు చేయగా...సోమ, మంగళవారాల్లో ఈ హడావుడి మరింత ఎక్కువ అవుతుంది. గతానికి భిన్నంగా ఈసారి ఆగమన్ పేరుతో విగ్రహం ఖరీదు చేయడం, మండపం వరకు తీసుకువెళ్లడం, ఏర్పాటు చేయడాన్నీ అట్టహాసంగా చేస్తున్నారు. వినాయకచవితి ముగిసిన మూడో రోజుల నుంచి నిమజ్జనాలు ప్రారంభం అవుతాయి. ఇలా వాహనాలపై విగ్రహాలకు తీసుకువెళ్లే సందర్భంలో అవి ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లకు తగిలి ధ్వంసం కావడం, ఇరుక్కుపోవడం జరిగే ఆస్కారం ఉంది. ఫలితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతుంది. ఆదివారం పంజగుట్ట ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విగ్రహం తీవ్ర ట్రాఫిక్ జామ్స్‌కు కారణమైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని, నగరంలోని ఫ్లైఓవర్ల ఎత్తును, విగ్రహాల ఎత్తుతో పోల్చుకుని అందుకు తగ్గ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
● గణేష్ విగ్రహంతో కూడిన వాహనం వెళ్లే మార్గంలోని వంతెనల కన్నా గరిష్టంగా ఐదు అడుగులు తక్కువగా విగ్రహం ఎత్తు ఉండాలి. వంతెన కింది ఉన్న రోడ్డు నుంచి ఈ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటారు.
● ‘గణేష్’ని తీసుకువెళ్లే వాహనం (లారీ, వ్యాన్ తదితరాలు) ఎత్తు గరిష్టంగా ఐదు అడుగులు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహం ఎత్తు వంతెన కంటే కనిష్టంగా 5 తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది.
● పోలీసు విభాగం గణేష్ విగ్రహాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల మెట్రో రైల్ మార్గం ఉంది. కొన్ని చోట్ల మెట్రో రైల్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ నిర్వాహకులు దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
● ప్రధానంగా ఎంజే మార్కెట్ మీదుగా భారీ విగ్రహాలు వెళ్లడం కష్టసాధ్యం. వీటిని మండప నిర్వాహకులు దృష్టిలో పెట్టుకుని, ముందుగానే అనువైన దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. విగ్రహం ఎత్తుతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.
● విగ్రహాల తరలింపునకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీసు కంట్రోల్ రూమ్ (100, 112) లేదా స్థానిక పోలీసుల్ని సంప్రదించాలి.