
వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
ఇబ్రహీంపట్నం రూరల్: వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా దృష్టి సారించాలని జిల్లా ప్రత్యేకాధికారి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించారు. సెర్ప్ సీఈఓ కార్యాలయం నుంచి మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు, యూరియా, ఎరువుల నిల్వలు, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హిమయత్‌సాగర్ పరిసర ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న వంతెనలు, ఫుల్ ట్యాంక్ లెవల్ ఉన్న చెరువులను తనిఖీ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఆయా శాఖల టీంలు సన్నద్ధంగా ఉండలని సూచించారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి కూల్చివేయాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ సంగీత, వైధ్యాధికారి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, డీఈఓ సుశీందర్‌రావు, పౌరసరఫరాల శాఖ అధికారి పారిజాత తదితరులు పాల్గొన్నారు.