
శంకర్‌పల్లి: ప్రభుత్వం తమకి వ్యవసాయం చేసుకోడానికి ఇచ్చిన భూమిని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నారని బాధితులు బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్ సురేందర్‌ని కలిసి వినతిపత్రం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొన్నగుట్టతండాలో సర్వే నంబరు 96/130లో 4ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకునేందుకు గాను అప్పటి ప్రభుత్వం 1967లో వాల్య అనే వ్యక్తికి ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉండగా, కొన్నేళ్ల క్రితం వాల్య మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన నలుగురు కుమారులు కిషన్, శంకర్, రాంసింగ్, అమ్రియాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం మోకిల తండాకు చెందిన ఓ వ్యక్తి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ భూమిని ఆక్రమించాడు. దీంతో అప్పటి నుంచి బాధితులు న్యాయం చేయాలంటూ తహసీల్దార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సమస్యపై తహసీల్దార్ సురేందర్ వివరణ కోరగా.. సంబంధిత అధికారులను వెళ్లి పరిశీలించాలని సూచించినట్లు స్పష్టం చేశారు.
అంత్యక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
కొత్తూరు: బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తూ ఓ దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘటన కొత్తూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి, తన భార్య పద్మతో కలిసి బైక్‌పై కాటేదాన్‌లో తమ బంధువుల అంత్యక్రియలకు ఉదయం బయలుదేరారు. కాగా పెంజర్ల కూడలిలో రోడ్డును దాటే క్రమంలో ప్యాసింజర్ జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విష యం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు చికిత్స నిమ్తితం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
జిల్లా మహాసభలకు తరలిరండి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి
శంకర్‌పల్లి: మొయినాబాద్‌లో ఆగస్టు 2న నిర్వహించే సీపీఐ 17వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి పిలుపునిచ్చారు. బుధవారం శంకర్‌పల్లిలో సీపీఐ మండలాధ్యక్షుడు సుధీర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రామస్వామి మాట్లాడుతూ.. 17వ జిల్లా మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరు అవుతున్నారని, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు. అదే విధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లాలని సూచించారు. సమావేశంలో నాయకులు గోపాల్‌రెడ్డి, అహ్మద్, రవీందర్, మల్లయ్య, సువర్ణ, యాదయ్య, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఠాణా నిర్మాణ పనుల పరిశీలన
దుద్యాల్: దుద్యాల్ గేట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ పనులను పరిగి డీఎస్సీ శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. పనులు వేగంగా సాగించాలని, త్వరగా పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అక్కడి నుంచి నేరుగా దుద్యాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల పని తీరును పరిశీలించారు. కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తుండాలని ఎస్‌ఐ యాదగిరికి సూచనలు చేశారు.