
మిగులు భూములు పేదలకు పంచాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం మిగులు భూములను పేదలకు పంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. మండలంలోని కప్పపహాడ్‌లో పార్టీ ఆధ్వర్యంలో ఓ భూస్వామి చేతిలో ఉన్న 98 ఎకరాల సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. 35 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కదంతోక్కారు. పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యతో కలిసి ట్రాక్టర్‌తో దుక్కిదున్ని, విత్తనాలు వేశారు. పొలం మొత్తం ఎర్రజెండాలు పాతారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. భూ చట్టాలను అతిక్రమించి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. కప్పపహాడ్‌లో ఓ భూస్వామి 98 ఎకరాలు కాజేయాలని చూశారన్నారు. కలెక్టర్, కోర్టులు ఆ భూమిని సీలింగ్‌గా ప్రకటించారని, ఈ భూమిని అక్కడన్న ఎస్సీ, ఎస్టీ, బీసీకులాల వారు 1989 నుంచి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. రైతులు కాస్తులో ఉన్నప్పటికీ రికార్డుల్లో నమోదు చేయాలని, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కప్పపహాడ్‌లో భూ సమస్యను పరిష్కరించాలని, లేదంటే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. పగడాల యాదయ్య మాట్లాడుతూ.. విలువైన భూములను కాజేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, డి.జగదీష్, బి.సామేలు, రాంచందర్, జగన్, సీహెచ్ జంగయ్య, బుగ్గరాములు, జగన్, ఎల్లేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ