
13 ఏళ్ల బాలికకు వివాహం
● నలుగురిపై కేసు నమోదు
● చిన్నారిని సఖి సెంటర్‌కు తరలింపు
నందిగామ: అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికకు వివాహం చేసిన ఘటనలో పెళ్లి కొడుకు, బాలిక తల్లితో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. నందిగామకు చెందిన 13 ఏళ్ల బాలిక స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు చేవెళ్ల మండలం కందవాడకు చెందిన శ్రీనివాస్‌గౌడ్(40)తో గత మే నెల 28న నందిగామ శివారులోని ఓ ఆలయంలో పెళ్లి చేశారు. అప్పటి నుంచి బాలిక నందిగామలో తల్లి వద్దే ఉంటోంది. పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని బాలిక ఇటీవల పాఠశాలకు వెళ్లి జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపింది. దీనిపై స్పందించిన హెచ్‌ఎం సుధాకర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన తహసీల్దార్ రాజేశ్వర్, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ బాలిక కుటుంబ సభ్యులను పీఎస్‌కు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు పెళ్లి చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. పెళ్లి కొడుకు శ్రీనివాస్‌గౌడ్, బాలిక తల్లి స్రవంతి, మధ్యవర్తి పెంటయ్య, పురోహితుడు ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సహకారంతో బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వివరించారు.
ఆక్రమణదారులపై
చర్యలు తీసుకోండి
మంచాల: తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కడీలు విరగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని తాళ్లపల్లిగూడ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోలమోని ఆశయ్య, పోలమోని భిక్షపతి, పొలమోని ప్రభు, కోయిగూర సుధాకర్, కోయిగూర భాస్కర్, కోయిగూర కరుణాకర్‌లకు సంబంధించి సర్వే నంబర్ 79లో 0–25 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని చిత్తాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని సదరు రైతులు ఆరోపించారు. మంగళవారం రాత్రి పొలంలో నాటిన కడీలను విరగొట్టారని, అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై సీఐ మధును వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.