
శాసీ్త్రయ విధానమే మేలు
షాబాద్: గొర్రెల పెంపకం లాభాదాయకంగా ఉండాలంటే పిల్లలు పుట్టిన వెంటనే శాసీ్త్రయ పద్ధతిలో యాజమాన్య పోషణ, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలి. సమగ్ర విధానాలతో జీవాలను కాపాడుకోవచ్చని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి గొర్రెల కాపరులకు సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గొర్రె పిల్ల పుట్టిన వెంటనే ముక్కు, నోరు మీద ఉండే పొర తొలగించి పొడి గుడ్డతో తుడవాలి. బొడ్డుదానంతట అదే విడిపోకపోతే రెండు అంగుళాలు కత్తిరించి అయోడిన్‌తో శుభ్ర పరచాలి. పుట్టిన గంటసేపు ముర్రుపాలు తాగించాలి. ముర్రుపాలలో ఏ, డీ, ఈ విటమిన్‌లు వ్యాధి నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీలు అధికంగా ఉంటాయి. పిల్లలను పొడిగా ఉంచి వెలుతురు, గాలి బాగా ప్రసరించే ప్రాంతాల్లో కట్టి వేయాలి. గొర్రె పిల్లలను చలి నుంచి కాపాడాలి.
పాటించాల్సిన పద్ధతి
పాలు మరిచే వరకు(దాదాపు 3 నెలలు) గొర్రె పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలను తల్లితోపాటు మందకు పంపకుండా కొట్టంలోనే ఉంచి పెంచాలి. తల్లితోపాటు పంపితే శక్తి వృథా అయి పెరుగుదల తగ్గుతుంది. ఇంటి దగ్గర పెట్టిన పిల్లలను గాలి, వెలుతురు బాగా ఉండే కొట్టంలో తడకలు కట్టి అందులో వదలాలి. వరిగడ్డి పక్కలో వేసితే వెచ్చగా ఉండి పిల్లలు మట్టి తినకుండా చూడవచ్చు.
గొర్రె పిల్లల పోషణ
గొర్రె పిల్లల్లో పెరుగుదల మొదటి మూడు నెలల్లో ఎక్కువ ఉంటుంది. ఇలా అధిక పెరుగుదలున్నా గొర్రె పిల్లలే ముందు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ బరువు తూగి లాభాలు చేకూర్చుతాయి. పాలు మరిచే వయసు వరకు తల్లిపాలకు అదనంగా పోషనివ్వాలి. చిన్న గొర్రెలను నిదానంగా ఆకు తింటూ అవి జీర్ణించుకోవడానికి అలవాటు పడతాయి.
ఆరోగ్య పరిరక్షణ
తల్లి గొర్రెలను మేతకు పంపిన తర్వాత వేపాకు లేదా దాణా వేసి అన్ని పిల్లల ఆరోగ్యంగా ఉన్నదీ లేనిది చూడాలి. మూడు నెలల వయసు దాటిన తర్వాత మొదటిసారి నట్టల నివారణ మందు తాపాలి. ఇది ఊపిరితిత్తుల్లోకి పోకుండా జాగ్రత్తగా తాపాలి. దీని తర్వాత 10–15 రోజుల వ్యవధిలో చిటుకువ్యాధి టీకా మందు ఇవ్వాలి. మరో 15 రోజులకు రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉంటుంది.
గొర్రెల సంరక్షణ అవసరం
రేగడిదోస్వాడ పశువైద్యాధికారి
డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి

శాసీ్త్రయ విధానమే మేలు