
పెండింగ్ దరఖాస్తులు పరిశీలించండి
● ఇందిరమ్మ ఇళ్ల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను నియమించాలి ● వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం మండల స్థాయి లో ప్రత్యేక బృందాలను నియమించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురు వారం క్యాంప్ కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశుద్ధ్యం, వనమహోత్సవం వంటి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఖాళీ స్థలం ఉండి, ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు మంజూరు ఇవ్వాలని, గతంలో రుణాలు తీసుకుని, ప్రస్తుతం అర్హులుగా ఉన్న వారికి అవగాహన కల్పించాలని, పీఎం ఆవాస్ యోజన కింద అర్హులైన వారందరి పేర్లను వెంటనే నమోదు చేయాలని సూచించారు.
ఎరువుల కొరత రానివ్వొద్దు
వర్షాకాలం నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లోని గోదాముల్లో అవసరమైన యూరియా ఎరువులు వంద శాతం అందుబాటులో నిల్వ ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఎక్కడా కొరత లేకుండా, రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి రావొద్దని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. నాణ్యమైన ఆహారం, తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చూడాలని, తాగునీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని, అందుకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లలో కూరగాయలు నిల్వ చేయకుండా రెండ్రోజులకు ఒకసారి తెచ్చుకోవాలని, వంట గదిని పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆయా ఎంఈఓలు పర్యవేక్షించాలన్నారు.
లక్ష్యం మేర మొక్కలు నాటాలి
వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, ప్రత్యేకించి ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు నాటాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పల్లె ప్రకృతి వనాల్లో వంద శాతం నాటాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున సరైన సమయంలో మొక్కలు నాటేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.