
చిరుత చిక్కింది
మణికొండ: కొద్దిరోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన చిరుత పులి ఎట్టకేలకు మంచిరేవుల ట్రెక్‌పార్కులోనే బోన్‌లో చిక్కింది. జూలై 7వ తేదీన మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్ వనమూళిక వనం నుంచి మొదలైన దాని ప్రస్థానం పోలీస్ గ్రేహౌండ్స్, ట్రెక్ పార్కు, రాందేవ్‌గూడ మిలిటరీ ఏరియా, తిరిగి ట్రెక్ పార్కుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాక ఆకలితో మేకను తినేందుకు బోనులోకి దూరి బందీ అయ్యింది. ప్రతి రోజూ మాదిరిగానే ఉదయం సిబ్బంది బోనులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఒకదాంట్లో చిరుత గాండ్రింపులు విని భయాందోళన చెందారు. అంతలోనే తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి బోను చుట్టూరా పరదాలను కట్టి నగరంలోని జూపార్కుకు తరలించారు. అక్కడ దాని గాయా లకు చికిత్సతో పాటు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, చిలుకూరు రేంజ్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
చిరుత మూతికి గాయం
బోనులో చిక్కుకున్న చిరుత అందులోనుంచి బయటికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దాని మూతి బోను ఇనుప చువ్వలకు తాకడంతో గాయమైంది. బోనులో చిక్కుకున్న భయంలో అది అందులో ఏర్పాటు చేసిన మేకను సైతం తినకుండా ఉండిపోయింది. చిరుత వయసు సుమారు 5 ఏళ్లు ఉంటాయని, యుక్త వయసులో ఉండటంతో పెద్దగా గాండ్రించటం, బెదిరించటం చేసిందని అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందనే విషయాన్ని తెలుసుకున్న మంచిరేవుల, గంధంగూడ, బైరాగిగూడ, నార్సింగి, కోకాపేట, రాందేవ్‌గూడ, ఇబ్రహీంబాగ్ తదితర గ్రామాల ప్రజలు దాన్ని చూసేందుకు ట్రెక్ పార్కు వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం నుంచి యథావిధిగా ట్రెక్ పార్కును తెరుస్తామని, వాకింగ్ చేసేవారు రావచ్చని అధికారులు తెలిపారు.
ట్రెక్ పార్కులోనే బోన్‌లోకి వచ్చి..
ఉదయం గమనించిన సిబ్బంది
తొలుత జూపార్క్‌కు తరలింపు
అక్కడి నుంచి నల్లమల అడవుల్లోకి..
నేటి నుంచి తెరుచుకోనున్న ట్రెక్ పార్కు