
పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతం చేయాలి
గచ్చిబౌలి: వర్షాకాల పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఉదయం వర్షాకాలం పారిశుద్ధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావుతో కలిసి తనిఖీ చేశారు. మొదట మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో తనిఖీలు చేశారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కాలనీల్లో పరిశుభ్రతా చర్యలు ప్రభావవంతంగా చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్, స్థానిక అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను సమీక్షించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య పనులను వేగంగా చేపట్టాలన్నారు.