
కుళ్లిన కూరగాయలతో భోజనమా?
శంకర్‌పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కుళ్లిన కూరగాయలతో వంట చేసి, భోజనం పెట్టడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్‌పల్లి కేజీబీవీ పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. బుధవారం శంకర్‌పల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే మొదట మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్, పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్‌కోర్టులు, గ్లౌజ్‌ల పంపిణీ చేశారు. పట్టణ శివారులో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపలికి వెళ్లి వంట గదిని ఆయన పరిశీలించారు. అక్కడ కూరగాయలు పాడైపోవడం, సాంబారులో పప్పు లేకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ ఫలాలు విద్యార్థులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. ప్రిన్సిపాల్, మరో ఉపాధ్యాయుడు ఎందుకు రాలేదని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికలో ఖాళీ స్థలం ఎందుకు వదిలేశారంటూ, ఆ ఖాళీ స్థలాన్ని ఆయన పూరించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, నాయకులు ప్రవీణ్, వెంకట్‌రాంరెడ్డి, ప్రకాశ్ గుప్తా, పాండు రంగారెడ్డి, చంద్రమౌళి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10 నిమిషాలు గేటు బయటే..
కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే రోజూ మాదిరి సిబ్బంది గేటుకు తాళం వేసుకొని లోపల ఉన్నారు. ఎమ్మెల్యే వచ్చినట్లు సమాచారం ఇచ్చినప్పటికీ దాదాపు 10నిమిషాల వరకు వారు గేటు తాళం తీయకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్, నాయకులు గేటు బయటే వేచి ఉన్నారు.
పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య ఆగ్రహం
మున్సిపాలిటీలో సిబ్బందికి దుస్తుల పంపిణీ