కలిసి పోరాడితేనే పరిష్కారం
షాద్‌నగర్: రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏకతాటిపైకి వచ్చి ప్రమోషన్లలో రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలో క్రిమిలేయర్ ఎత్తివేయడంతో పాటు ఈడబ్ల్యూఎస్‌ను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎదురవుతున్న సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు. బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ (అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్), వైస్ ప్రెసిడెంట్‌గా పద్మనళిని (బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం), కార్యదర్శిగా రాఘవేందర్‌గౌడ్(ఐటీఐ కాలేజీ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్), మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్వేత(లెక్చరర్), ముఖ్య సలహాదారులుగా బాల్‌రాజ్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమ, రాష్ట్ర కార్యదర్శి మహేంద్రసాగర్, జిల్లా బీసీ ఉద్యోగులు కరుణశ్రీ, శ్వేత, జ్యోతి, నర్సింలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఉద్యోగుల సంఘం నేతలు
జిల్లా నూతన కమిటీ ఎన్నిక


