మందకొడిగా.. | Sakshi
Sakshi News home page

మందకొడిగా..

Published Tue, May 14 2024 3:30 PM

-

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే అప్పటికే రిజర్వ్‌లో ఉంచుకున్న ఈవీఎంలను వాటి స్థానంలో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కందుకూరు మండలం తిమ్మాపూర్‌ అనుబంధ గ్రామం చీమలవానికుంట పాటు కొత్తూరు మండలం కోడిచర్ల తండాలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఆయా గ్రామాల ఓటర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఇక చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం మందకొండిగా ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. మహిళలు, వృద్ధులు, రైతులు, కూలీలు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు 8.34 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, 11 గంటల వరకు 20.23 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 34.56 శాతం ఓటింగ్‌ నమోదైంది. 3 గంటల వరకు 45.35 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 68.23 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 41.07 శాతం నమోదయ్యింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదయ్యింది.

మొరాయించిన ఈవీఎంలు

మొయినాబాద్‌ మండలం ఎనికేపల్లిలోని 142 పోలింగ్‌ కేంద్రంలో కొద్దిసేపు ఈవీఎం మొరాయించింది. కాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి ఇదే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. బడంగ్‌పేటలోని 235, 237 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలు సైతం మొరాయించడంతో అక్కడ 50 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి పోలింగ్‌బూత్‌ 112లోని ఈవీఎం పనిచేయకపోవడంతో అధికారులు మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌ పట్టణంలోని 247 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో ఇక్కడ పోలింగ్‌ కొద్దిగా ఆలస్య మైంది. ఫరూక్‌నగర్‌ మండలం పీర్లగూడలోని ఓ పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ ఇంజాపూర్‌లోని 225 బూత్‌లో ఈవీఎం దాదాపు 40 నిమిషాల పాటు మెరాయించింది. ఫరూక్‌నగర్‌ మండలం ఎలికట్టలోని 169 పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎం మెరాయించడంతో ఓటర్లు చాలాసేపే క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. అయితే పలు కేంద్రాల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి ఓటువేసేందుకు యువత ఉత్సాహం చూపారు. ట్రాన్స్‌జెండర్ల కూడా క్యూలో నిల్చొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా ఈవీఎంలు మొరాయించిన చోట క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సి ఉండటంతో వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు.

ఓటేసిన ప్రముఖులు

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కౌకుంట్లలో ఓటేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఖానాపూర్‌లో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తొర్రూర్‌లో, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వీర్లపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బడంగ్‌పేట మేయర్‌ పారిజాత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే టీకేఆర్‌ తమ ఓటుహక్కును వినియోగించున్నారు.

చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఓటింగ్‌ శాతం ఇలా..

అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 9గం మ.1గం మ.3గం సా.5 గంటలకు రా.7గంటలకు

మహేశ్వరం 7.26 31.84 41.23 49.77 51.70

రాజేంద్రనగర్‌ 7.12 31.49 42.15 50.54 53.13

శేరిలింగంపల్లి 6.59 27.49 35.55 41.07 43.11

చేవెళ్ల 10.31 43.11 58.62 68.23 70.84

పరిగి 11.38 43.57 56.36 62.59 65.98

వికారాబాద్‌ 10.37 45.16 57.63 66.86 69.44

తాండూరు 11.85 41.05 54.95 63.00 66.34

మొత్తం 8.34 34.56 45.35 53.15 60.07

(అంచనా)

షాద్‌నగర్‌, మహేశ్వరంలో నిరసనలు

కందుకూరు మండలం తిమ్మాపూర్‌ అనుబంధ గ్రామం చీమలవాని కుంటకు పోలింగ్‌ కేంద్రం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేశారు. అంత దూరం మేం పోలేమని చీమలవాని కుంట ఓటర్లు నిరసనకు దిగారు. అధికారులు నచ్చజెప్పడంతో చివరకు వారు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కొడిచర్ల తండావాసులు స్థానికంగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు తండాకు చేరుకుని నచ్చజెప్పడంతో చివరకు వారు శాంతించి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్న ఓటింగ్‌

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

పోలింగ్‌ కేంద్రాలు దూరంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల నిరసన

ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు

చేవెళ్లలో అత్యధికం..శేరిలింగంపల్లిలో అత్యల్పం

Advertisement
 
Advertisement
 
Advertisement