కరీంనగర్‌క్రైం: కరీంనగర్ భగత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ శనివారం పోలీస్ కమిషనర్ గౌస్ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కరీంనగర్ జిల్లా జైలు నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. గత జూలై 21న అర్ధరాత్రి భగత్‌నగర్‌లో మహ్మద్ అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన ముఠా సభ్యులు డమ్మీ తుపాకులు, కత్తులతో కుటుంబ సభ్యులను బెదిరించి దాడికి పాల్పడ్డారు. వృద్ధులు, మహిళలను కొట్టి ఒక గదిలో బంధించి రూ.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, రెండు మోటార్ సైకిళ్లతో కలిపి సుమారు రూ.43 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆగస్టులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరాలకు పాల్పడిన నేపథ్యంలో వారిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరానికి చెందిన మహ్మద్ రజావుద్దీన్, మహ్మద్ అజీమ్రజా, సల్మాన్ అలియాస్ భూరే అలియాస్ యాదవ్, సల్మాన్ అలియాస్ విమన్, మహ్మద్ హసీన్. కేసు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించి, నిందితులపై పీడీ యాక్ట్ అమలులో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ పట్టణ ఏసీపీ ఎన్.వెంకటస్వామి, వన్‌టౌన్ సీఐ కె.రాంచందర్‌రావును సీపీ అభినందించారు.


