● భూరికార్డులు మర్లేస్తున్న రెవె‘న్యూ’ అధికారులు ● ప్రభుత్వ భూములపై జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్వేషణ ! ● చేతులు మారిన పట్టాలపై ఆరా ● 22ఏ జాబితా మరోసారి తనిఖీ ● 55 ఏళ్ల భూరికార్డుల పరిశీలన
సిరిసిల్ల: జిల్లాలోని భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. ఇందులో 2,700 ఎకరాలను గుర్తించారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించారు. ఆ దశలో రెవెన్యూ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, వీఆర్వోలు, పైరవీకారులు చేతులు కలిపి భూరికార్డులను మార్చివేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన చందుర్తి తహసీల్దార్‌ను అప్పట్లో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూములను ఇతరుల పేరు మీదకు మార్చేటప్పుడు శాసీ్త్రయమైన ఆధారాలు చూపకుండానే రికార్డులు మార్చినట్లు ఫోరెన్సిక్ తనిఖీల్లో బయటపడింది. జిల్లాలో జరిగిన భూరికార్డుల అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లో లాగిన్ అయిన భూరికార్డులను ఎవరు మార్చారు.. ఎప్పుడు మార్చారు.. ఆ మార్పుకు ఆధారాలు ఏమిటీ? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అప్పట్లోనే ధరణి నుంచి తొలగించి ఆ భూములన్నింటినీ నిషేధిత జాబితా 22–ఏలో చేర్చారు. ఇందులో సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు, సర్దాపూర్, జగ్గారావుపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, తంగళ్లపల్లి మండలం మండెపల్లి, తాడూరు, బద్దెనపల్లి, సారంపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, ఇల్లంతకుంట, చందుర్తి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ ఆ భూములను లోతుగా 55 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తూ ఒక్కో సర్వే నంబరును నమోదు చేస్తున్నారు.
దళిత మహిళలకు కేటాయింపులపై ఆరా !
జిల్లాలో భూమి కొనుగోలు పథకం(ఎల్పీఎస్)లో భూమి లేని నిరుపేద దళిత మహిళలకు 2014 నుంచి 2021 వరకు 165 మందికి 436.02 ఎకరాలు కేటాయించారు. మూడెకరాల భూమి కేటాయింపుల్లో భాగంగా రూ.21.67కోట్లతో ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేశారు. వాస్తవానికి పట్టాలు పొందిన దళిత మహిళలు ఆ భూములను సాగుచేసుకుంటున్నారా? పడావులుగా(బీడుగా) ఉంచారా.. నీటి వసతి ఉందా? ఆ పట్టాలు పొందిన దళిత మహిళలు అర్హులేనా.. అందులోనూ అనర్హులు ఉన్నారా..? అప్పటి అధికార పార్టీ నేతల జోక్యంతో భూముల కేటాయింపులు జరిగాయా..? అనే అంశాలను సేకరిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ యోగ్యమైన భూములను కొనుగోలు చేశారా? ప్రజాధనాన్ని దోచిపెట్టేలా వ్యవసాయానికి పనికిరాని భూములను కొనుగోలు చేసి దళితులకు కట్టబెట్టారా? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. భూమి కొనుగోలు పథకంలోనూ అక్రమాలు ఉన్నట్లు తేలితే.. అక్రమార్కులపై కేసులు పెట్టాలని భావిస్తున్నారు.
సమగ్ర నివేదిక సర్కారుకు..
జిల్లాలో అసైన్మెంట్ భూములపై అధికారులు లోతుగా ఆరా తీసి సమగ్ర నివేదికను జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈమేరకు జిల్లాలోని రెవెన్యూ అధికారులు భూరికార్డులను గోప్యంగా పరిశీలిస్తూ.. నివేదికలు తయారు చేస్తున్నారు. సర్కారు భూములు పట్టాలు పొందిన వారు, ఆ భూములపై పరిహారం పొందిన వారు, అమ్ముకున్నవారు.. ప్రస్తుత పరిస్థితి.. నిషేధిత జాబితాలో ఉన్న భూములు.. ఇలా మొత్తంగా జిల్లాలో పరాధీనమైన ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు.
కలెక్టరేట్లో సెప్టెంబరు 29న కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి భూముల అవకతవకలపై ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు, జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవో 134 ప్రకారం ప్రభుత్వ భూములు పట్టాల రూపంలో పరాధీనమైన అంశంపై ఆరా తీశారు. 1960 నుంచి భూరికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూములను పట్టాలు పొందిన వారు.. ఎన్వోసీ పొంది ఇతరులకు అమ్ముకున్న వారు, ప్రభుత్వ భూముల పట్టాలు మారిన తీరుపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని అన్ని మండలాల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈమేరకు జిల్లాలో భూరికార్డులను రెవె‘న్యూ’ అధికారులు మర్లేస్తున్నారు.
భూముల వివరాలు
గ్రామాలు : 260
మండలాలు : 13
రెవెన్యూ గ్రామాలు : 171
సర్వే నంబర్లు : 91,416
భూములు : 4,68,532 ఎకరాలు
22ఏ జాబితాలో భూములు
: 3,718 ఎకరాలు
కేటాయించిన అసైన్మెంట్ భూములు
: గోప్యంగా ఉంచారు


