● విద్య.. వైద్యంపై కలెక్టర్ ఫోకస్ ● నిత్యం క్షేత్రస్థాయి తనిఖీలు ● ఇదీ కలెక్టర్ గరీమా అగ్రవాల్ శైలీ
సిరిసిల్ల: కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ విధుల్లో చేరి ఏడాది అవుతుంది. మొదటి పోస్టింగ్ అయినా పాలనతో తనదైన ముద్ర వేశారు. తొలి మహిళా కలెక్టర్‌గా హరిత నియమితులు కాగా.. నెల రోజుల్లోనే ఆమె దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా 2025 అక్టోబరు 23న గరీమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గరీమా అగ్రవాల్ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జన్మించారు. హైదరాబాద్ ఐఐటీలో చదివారు. జిల్లాలో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో, ఎన్నికల కోడ్ అమలులో తన మార్క్ చూపారు. జిల్లాలో విద్య, వైద్యం రెండు కళ్లుగా ముందుకెళ్తున్నారు.
గాడినపడ్డ విద్యావ్యవస్థ
జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిలో పెట్టారు. గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేస్తూ వంటల నాణ్యత.. పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు చేస్తుంటారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వేములవాడ ఎంజేపీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజయ్యను సస్పెండ్ చేశారు. కలెక్టర్ విద్యార్థినిగా మారి పాఠాలు ఎలా చెబుతున్నారనే విషయాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీ మంగళవారం పది నిమిషాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
నాణ్యమైన వైద్యం
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రి, జిల్లా జనరల్ ఆస్పత్రులను నిత్యం తనిఖీ చేస్తూ వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా రూ.83 లక్షల పరికరాలు తెప్పించి పంపిణీ చేయించారు. రూ.2.93కోట్లతో 16,631 వీల్‌చైర్లు, వాకింగ్ కర్రలు, రోలెటర్లు తెప్పించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అగ్రస్థానం
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను వేగంగా ముందుకు సాగేలా పర్యవేక్షిస్తూనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు.
విద్యార్థులతో కలిసి పాఠాలు వింటున్న కలెక్టర్
బాలికలతో ముచ్చటిస్తున్న కలెక్టర్..
సమష్టి కృషితోనే సాధ్యం
జిల్లా కలెక్టర్‌గా ఇది నాకు మొదటి పోస్టింగ్. నేను ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాల్సి వచ్చింది. గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సవాల్‌గా స్వీకరించి పూర్తి చేశాము. ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాం. వేములవాడ ఆలయ అభివృద్ధి, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, సీఎస్‌ఆర్‌లో రూ.కోటితో స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటు, 500 బెడ్స్ బాలికలకు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాం. గోదాముల నిర్మాణాలు, రైతులను సన్నవడ్ల వైపు ప్రోత్సహించడం, ఆయిల్ పామ్ సాగులో ముందున్నాం. జిల్లాలో చేపట్టిన అనేక పనులు ఎంతో సంతృప్తినిచ్చాయి. అందరి సహకారంతో ముందుకెళ్తాను.
– గరీమా అగ్రవాల్, కలెక్టర్


