● వరిగెలలు తొలిచేస్తున్న రేల్లరాల్చే పురుగు ● రాత్రి వేళల్లోనే దాడి చేస్తున్న ‘ఆర్మీవార్మ్’
ముస్తాబాద్: ఈ సీజన్ రైతులకు కలిసిరావడం లేదు. వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో సాగు విస్తీర్ణం పడిపోగా.. వేసిన సన్నరకం ధాన్యం చేతి కొచ్చిన సమయంలో రేల్లరాల్చే పురుగుల దాడితో నేలరాలిపోతోంది. గతంలో రైతులను అకాల వర్షాలు దెబ్బతిస్తే.. ఈసారి రేల్చరాల్చే(ఆర్మీవార్మ్) పు రుగుల దాడితో వరిగొలకలు నేలరాలి పోతున్నా యి. ఆర్మీవార్మ్ దాడితో ఇప్పటికే 25 శాతం పంట దిగుబడి పడిపోయిందని తెలిసింది.
సన్నరకంపైనే దాడి
సాగువిస్తీర్ణం పడిపోయిన పంటకు ధర వస్తుండడంతో రైతులు సంబరపడ్డారు. కానీ ఇటీవల చేతికొస్తున్న సన్నరకం వరిపైరుపై ఆర్మీవార్మ్ దాడితో ఆందోళన చెందుతున్నారు. కోతకు వచ్చిన సన్నరకం వరిపై రాత్రి వేళల్లో దాడి చేసి గెలలను కట్ చేస్తున్నాయి. రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉండడంతో కర్ర అడుగు భాగంలో దాగి ఉండే పురుగులు పైకి వచ్చి గొలకలను కొరికివేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10వేల ఎకరాల్లో ఆర్మీవార్మ్ పురుగుల తాకిడికి ధాన్యం రాలిపోయిందని అంచనా. జిల్లాలో ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, ఇల్లంతకుంట, కోనరావుపేట, గంభీరావుపేట తదితర మండలాల్లో ఈ పురుగు కనిపిస్తుంది.
పురుగులను నివారించడం ఇలా..
నాలుగు రోజుల వ్యవధిలో పంట కోస్తే ఎలాంటి మందులు చల్లాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. పంట కోతకు ఇరవై రోజుల వ్యవధి ఉంటే పొలంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని సూచించారు. క్లోరిఫైరిపాస్, సైపర్మెత్రిన్ కలిపి మొక్క మొదళ్లలో పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.
వడ్లు రాలిపోయాయి
మూడు రోజుల్లో కోతకు వచ్చిన పంటలో చూస్తుండగానే వడ్లు రాలిపోతున్నాయి. నేను మూడు ఎకరాల్లో సన్నరకం వేసిన. కోతకు వచ్చిందని నీళ్లు పెట్టడం ఆపిన. మిల్లు తరలిద్దామనుకునే లోపే పంటలో పురుగులు కనిపించాయి. చూస్తే వరికంకులు రాలిపోయి ఉన్నాయి. భారీగా నష్టం జరిగింది.
– రాయిని అంజయ్య, రైతు
సాయంత్రం మందుచల్లాలి
ఆర్మీవార్మ్ పురుగులు వరిగెలలను కత్తిరిస్తాయి. పంట కోత దశలో నష్టం చేస్తాయి. పురుగులు ఎక్కువగా ఉంటే వెంటనే పంటను కోయాలి. పంట కోతకు పక్షం రోజుల సమయం ఉంటే సాయంత్రం వేళల్లో క్లోరిఫైరిపాస్ 2 మి.లీ లేదా క్వినాల్పాన్ 2.మి.లీ లేదా సైపర్మైత్రిన్ను ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్లలో పిచికారీ చేయాలి.
– అనూష, వ్యవసాయాధికారి


