సిరిసిల్ల: గంభీరావుపేట పోలీస్‌స్టేషన్ ఎస్సై సీహెచ్. శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీ, జోన్–3 రాజన్న డీఐజీ ఇన్‌చార్జి ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘన, విధుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం, అదుపులోకి తీసుకున్న నిందితులపై భౌతిక దాడికి పాల్ప డ్డారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను ఇప్పటికే ఎస్పీ మహేశ్ బీ గీతే విధుల నుంచి తప్పించి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసి, ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేశ్‌ను గంభీరావుపేట ఎస్‌హెచ్‌వోగా ఇన్‌చార్జీగా నియమించారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులను విచారణ అధికారిగా నియమించారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా డీఐజీ ఆదేశాలతో ఎస్‌ఐ శ్రీకాంత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
రెండు జిల్లాల సరిహద్దుల రీసర్వే
ముస్తాబాద్: రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరి హద్దుల వద్ద భూ రీసర్వే చేపట్టినట్లు తహసీల్దార్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు. ముస్తాబాద్ మండలం మొర్రాపూర్, సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ మధ్య రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో శనివారం సర్వే చేపట్టారు. తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామాల సరిహద్దులతోపాటు జిల్లాల సరి హద్దులపై సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. శాటిలైట్ ద్వారా పకడ్బందీగా భూ రీసర్వే జరుగుతుందన్నారు. నారాయణరావుపేట, ముస్తాబాద్ మండలాల హద్దుల నిర్ణయం కూడా అక్కడి తహసీల్దార్ సమక్షంలో చేపట్టామన్నారు. సర్పంచ్ రాజు, ఆర్‌ఐ ప్రవీణ్, సర్వేయర్లు, జీపీవోలు పాల్గొన్నారు.


