కరీంనగర్: చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అల్లాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 23న కరీంనగర్, సిరిసిల్ల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గురువారం కరీంనగర్లోని రాజశ్రీ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి ముఖ్యనేతల సమావేశం జరిగింది. పార్టీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపి, కరీంనగర్ జిల్లా ప్రభారి శాంతికుమార్, సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి మోహన్రెడ్డి, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి కన్నబోయిన ఓదెలు, బాస సత్యనారాయణరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, కోమల ఆంజనేయులు హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు 23న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి, ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


