● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: దుర్గా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. సిరిసిల్లలోని మార్కండేయవీధి, వెంకంపేటల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎస్పీని శాలువాతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు స్థల పరిశీలన
ఇల్లంతకుంట: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమున్న చోట్ల సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని వెల్జీపురంలో నూతనంగా నిర్మించే 33/11 కేవీ సబ్‌స్టేషన్ కోసం స్థలాన్ని పరిశీలించారు. వెల్జీపురంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3.76 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. డివిజనల్ ఇంజినీర్ అంజయ్య, ఏఈ నగేశ్‌కుమార్, సర్పంచ్ నాయిని నవీన్‌కుమార్, బొల్లం పరుశురాం పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక
గంభీరావుపేట: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు మండలంలోని కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన క్రిస్సిక, రోహిణి, సంజ, రిషిత్ ఎంపికయ్యారు. ఈనెల 11న ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 16, 17 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. హెచ్ఎం పోతుల నారాయణ, పీఈటీ భార భాను అభినందించారు.
‘చేయూత’ దరఖాస్తులపై డీపీవో విచారణ
ముస్తాబాద్: చేయూత పెన్షన్ల దరఖాస్తులపై జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య ముస్తాబాద్ మండలం పలు గ్రామాల్లో గురువారం విచారణ చేపట్టారు. ఇప్పటికే మండలస్థాయి అధికారులు చేయూత కోసం వచ్చిన దరఖాస్తులపై విచారణ చేపట్టగా, జిల్లాస్థాయి అధికారులతో మరోసారి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఈమేరకు డీపీవో వీరభద్రయ్య వెంకట్రావుపల్లి, బందనకల్, తెర్లుమద్ది, పోతుగల్ గ్రామాల్లో చేయూత దరఖాస్తులను పరిశీలించారు. అలాగే ఆయా గ్రామ పంచాయతీల రికార్డులను డీపీవో పరిశీలించి సూచనలు చేశారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాజిద్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
సిరిసిల్ల అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఈనెల 13 నుంచి ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గురువారం మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, ప్రమాదబీమా, హెల్త్‌కార్డులు కల్పించాలన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.


